Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"కాగితపు" ప్రేమలేఖ వర్సెస్ "ఎలక్ట్రానిక్" లవ్ మెసేజ్. ఏది గొప్ప...?

WD
పురుషులు గానీ, స్త్రీలు గానీ సెక్స్ భేదమైనపుడు ఒకరికొకరు రాసుకునే లేఖలే ప్రేమలేఖలు. ప్రేమపూర్వకంగా ఒకరికొకరు మనసు విప్పి రాసుకునే ఉత్తరం ప్రేమలేఖ. ఈ ప్రేమలేఖ చాలా ఘాటుగా ఉంటుంది. ఇప్పుడైతే సెల్ ఫోన్లో ప్రేమ సందేశాలు.. ఇ-మెయిళ్లలో విరహ వేదనలు క్షణాల్లో పాకిపోతున్నాయి కానీ... ఇదివరకటి రోజుల్లో ప్రేమించిన వ్యక్తి మనసు లోతులను తెలుసుకోవాలంటే ప్రేమలేఖలే శరణ్యం.

మెయిల్ అండ్ సెల్ ప్రేమ సందేశాలకు ప్రేమలేఖలకున్నంత "పవర్" ఉండదు. తన మనసులో సంచరిస్తున్న ప్రేమికుడు/ప్రేయసి గుర్తులు అక్షర రూపాలుగా మార్చుకుని అవతలి వ్యక్తి హృదయాన్ని పట్టి లాగేసే శక్తి ప్రేమలేఖది. విరహమే ప్రేమలేఖలకు ముఖ్య కారణం. సాధారుణులలో విరహం ప్రేమకు గోరీ కడుతుంది. ఎందుకంటే దేహాలు ఉపయోగించకుండా, హృదయాలతో ప్రేమ నిలుపుకోగల శక్తి ఈ మనుషులకు చాలా అరుదు కనుక.

వియోగం ముఖ్య కారణం కావడం చేతనే, ప్రేమలేఖలు సర్వసాధారణంగా జాలిగా దిగాలుగా ఉంటాయి. కాళిదాసు మేఘసందేశం ప్రేమలేఖలుగా చెప్పవచ్చు. ఆ కవి హృదయంలో రగిలిన విరహవేదనను "ప్రేమలేఖ" కావ్యంగా తీర్చిదిద్దాడు.

అసలు గట్టిగా తపన పడనివాడు, నరాలు చీలేట్లు వేదనతో కొట్టుకోనివాడు, రాత్రులకు రాత్రులు నిరాశతో కమలనివాడు, వెర్రిగా అన్నీ తన్నేసి అందని దానికోసం పరుగులెత్తనివాడు, తిండీ డబ్బూ కాక యింకా యేదో ఉన్నతమైనది ఉన్నదనుకునేవాడు, తనకే అర్థంకానిది, ఏదో ఎండమావులకోసం ఆశలు పడనివాడు, కలలే లేని మానవుడు, ప్రేమలేఖలు ఎలా రాయగలడు...? ఒకవేళ ప్రేయసి లేఖలు రాస్తే మాత్రం వాటిని ఎలా చదివి ఆనందించగలడు..?

ప్రియురాలు దగ్గర లేనప్పుడు ఆమెతో సన్నిహితంగా మాట్లాడమే ప్రేమలేఖ. ఆంతరంగికుడైన మిత్రునితో హృదయంలోని మార్దవమైన అభిప్రాయాలను చెప్పుకోవడమే ప్రేమలేఖ. సర్వకాల సర్వావస్తల్లోనూ నిన్నే అన్వేషిస్తున్నానని జ్ఞాపకం చెయ్యడమే ప్రేమలేఖ. అటువంటి ప్రేమలేఖలను ఎన్ని ప్రేమ హృదయాలు నేడు ఆస్వాదిస్తున్నాయీ అంటే సందేహమే.

ఎందుకంటే నేటి మోడ్రన్ లైఫ్‌లో సెల్ బటన్లతో... కంప్యూటర్ కీ బోర్టుతోనో యాంత్రికమైన భావాలను టపాటపా నొక్కుతూ ఏదో పనిచేసుకుంటూ పంపేస్తుంటారు. ఇది ప్రేమ నిండిన హృదయంతో ఉండదు గాక ఉండదు. అదే సమయంలో హృదయంలో మెదిలే భావాక్షరాలను పేపరుపై పెన్నుతో మనసారా పరిస్తే.. ఆ ప్రేమాక్షర సౌందర్యం ప్రేమ హృదిని వెన్నెలలో తడుపుతుంది. నులివెచ్చని ప్రేమమాధుర్యంలో ఓలలాడిస్తుంది. ఆ కమ్మదనం "పేపరు" ప్రేమలేఖలు అందుకున్నవారికే సొంతం.

Share this Story:

Follow Webdunia telugu