నిజమే...
రెండు పనుల భారం మోస్తున్నది నిజమే..
కట్టుకున్నందుకు నన్నూ,
పని ఒప్పుకున్నందుకు ఆఫీసునూ
ఒంటిచేత్తో మోస్తున్నదీ నిజమే...
నా ఇష్టాలు, నా అభిరుచులూ
నా వ్యాపకాలు, నా సాహిత్యాలూ
నా పరిచయాలూ, మిత్ర సాంగత్యాలూ
తప్పవని నాకు నేను చెప్పుకుంటున్న పనులూ
మరి ఇవన్నీ మగవాడికే కదా ఉండేది..
ఎన్ని సాకులు, ఎన్ని మగపనులు..
తరతరాలుగా ఇవేగా మా ఆయుధాలు..
స్త్రీకి కూడా శరీరం ఉంది
దానికి వ్యాయామం ఇవ్వాలి
స్త్రీకి కూడా మెదడు ఉంది
దాన్ని ఆలోచింపనివ్వాలి..
అని గుర్తుకురాని సమాజమేమో..
మీకూ కొన్ని ఇష్టాలుంటాయని..
మీకూ కొన్ని కనీస కోరికలు ఉంటాయని
మీకూ కొన్ని పంచుకునే అనుభూతులు ఉంటాయని
ఇక్కడ మనుషులం మర్చిపోయామేమో..
కానీ..
నా మధుహృదయమా...
భూమాత భారం మోస్తున్నట్లుగా
నా భారం నువ్వు మోస్తున్నావు...
కృతఘ్నుడిని కాను..
చేసిన మేలు మరిచేవాణ్ణి అసలే కాదు...
కాని నన్ను నేను...
నీ ముందు వ్యక్తపర్చుకోలేకపోతున్నాను
నావిరామ క్షణాల కోసం
కరుగుతున్న నీదైన సమయం సాక్షిగా..
నా మనఃకుహరాల్లో దాగిన ఆ
కృతజ్ఞతా సంస్కారాన్ని
నీ ముందు పరచలేకపోతున్నాను..
ఒకే ఒక్క మాట..
ఇంకేం చెప్పలేను..
నీవు లేని నేను లేను..