ప్రియతమా...
అన్నీ తెలుసనుకుంటాను..
జ్ఞానోదయమంటే..
తెలియడం అనే కదా..
కాని.. స్త్రీ గురించి తెలీదనే విషయం
చాలా లేటుగా తెలిసింది మరి..
నీ గురించి అయితే మరీనూ...
జీవితపు యవ్వనాకాంక్షాలలో
ఆశయాల ఒరవడిలో
పెనవేసుకున్న భావానుబంధమేగా మనది
ఆటుపోట్ల మధ్య,
అభిజాత్యాల మధ్య,
హృదయాలకు తగులుతూ వచ్చిన
పెనుగాయాల మధ్య..
సంచలనాత్మక సంఘటనల మధ్య
చెక్కుచెదరని అనుబంధమేగా మనది..
అయినా ఒక్కోసారి
మనం అర్థం కాము..
మనకు మనం అర్థం కాము..
మనం ఇతరులకు అర్థం కాము..
ఇతరులు మనకు అర్థం కారు..
మనకు ఇతరులు అర్థం కాకుంటేనేం..
మనకు మనమే అర్థమే కాకపోతేనే..
ఏమిటి, ఎందుకు, ఎందుకిలా..
మనం విశ్వసిస్తున్నాం..
ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం..
విశ్వసిస్తూనే తూట్లు పొడుచుకుంటున్నాం.
అనుమానాలు కాదు
ద్వేషానలాలు కాదు..
మాటలతో యుద్ధాలు చేసుకుంటున్నాం..
అక్కడే ఏదో జరుగుతోంది.
ప్రియతమా! మాటలతో యుద్ధాలు మానుదామా...
నోరుదాటితే ఊరు దాటుతుంది కదా..