పూర్వకాలంలో అనగా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే లేఖలు మరియు సంజ్ఞా భాషలు ఉద్భవించని పురాతన కాలంలో ముకుందుడనే యువకుడు ఉండేవాడు. అతని శ్రేయస్సును కోరే స్నేహితులు, కుటుంబ సభ్యులు చెపుతున్నా వినకుండా ఒక్కడే శ్రీశైలం అడవుల్లో వేటకు వెళ్ళాడు. సాయంత్రమయ్యే సరికి అడవిలో దారి తప్పాడు.
ఏం చేయాలో, అడవి నుంచి ఎలా బయటపడాలో తెలియని అయోమయంలో సమీపంలో తపస్సు చేసుకుంటున్న ఒక మునికి తపోభంగం కలిగించాడు. దాంతో ఆగ్రహించిన ఆ ముని, జీవితాంతం మూగవానిగా ఉండిపొమ్మని ముకుందని శపించాడు. కాళ్ళపై పడి క్షమించిన కోరిన ముకుందునికి నెలకు ఒక పదాన్ని మాత్రమే మాట్లాడగలిగే అవకాశాన్ని ముని ఒసంగినాడు. అంతేకాక అడవి నుంచి బయటపడే మార్గాన్ని చూపి మరలా తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు.
తిరిగి గ్రామానికి వచ్చిన ముకుందునికి అందమైన యువతి కనిపించింది. తొలి చూపులోనే ఆమె ప్రేమలో పడిపోయాడు. తన మనసులోని భావాన్ని చెప్పాలంటే ముని సవరించిన శాపాన్ని అనుసరించి మరో మూడు నెలలు ఆగవలసిందే. అలా మూడు నెలలు ఆమెకు తెలియకుండా ఆమెను చూస్తూ తనలోని ప్రేమికునికి సర్దిచెప్పుకున్నాడు.
చూస్తుండగానే మూడు నెలలు గడిచిపోయాయి. ఒకరోజు ముకుందుడు ప్రేమిస్తున్న ఆ సౌందర్యరాశి, ముకుందుడు పొరుగింట్లోని తన స్నేహితురాలిని కలవడానికి వచ్చింది. ఇంకేముంది మన ముకుందుని ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి. గబగబా తన హృదయేశ్వరికి ఎదురుగా వెళ్ళి నిలుచున్నాడు. ఏమిటన్నట్లుగా ముకుందుని వైపు చూసింది. నెమ్మదిగా గొంతు విప్పాడు.
ముకుందుడు: "నేను నిన్ను ప్రేమిస్తున్నాను"
అదేసమయానికి హృదయేశ్వరి స్నేహితురాలు ఇంట్లో నుంచి పెద్దగా పిలిచింది.
హృదయేశ్వరి ముకుందుని వైపు చూసింది.
హృదయేశ్వరి: "నా నేస్తం పిలుపు మధ్య మీరు చెప్పింది ఆలకించలేకపోయాను. మరోసారి చెప్తారా?"
అంతే... మూడు నెలల పాటు పోగుచేసుకున్న మూడు పదాలు కాస్త ఖర్చయిపోవడంతో ముకుందుడు కింద పడిపోయాడు.