ఏమిటీ క్యుపిడ్... స్టుపిడ్‌ల సంగతీ అనుకుంటున్నారా...? వీటి సంగతి తెలుసుకునే ముందు ఓసారి కాలేజీ క్యాంపస్‌కెళ్దాం...
కొత్తగా కళాశాల ప్రారంభించిన రోజులు... అమాయకపు బాయ్స్‌తో పాటు దేశముదురు అంకుల్స్( పదిసార్లు ఫెయిలై మళ్లీ కాలేజీలో అడుగుపెట్టే బాపతు) హడావుడి మొదలవుతుంది. కాలేజీకి కొత్త అందాలను తెస్తూ క్యాంపస్‌కే ఓ నందన వనం. అర్థం కాలేదా... అదే అందమైన కాలేజీ అమ్మాయిల రాకా మొదలవుతుంది.
ఇక ఇక్కడ నుంచే మొదలవుతాయి అబ్బాయిలు- అమ్మాయిల పరిచయాలు... పలుకరింపులు... వగైరా... వగైరా. అయితే అమ్మాయిని పలుకరిస్తే "ఊ...", "హాయ్...", "హలో..." అంది కదా అని కొంతమంది దేశముదురు అంకుల్స్ లవ్ లైన్ వేయడానికి వెంటబడతారు.
అప్పుడు అమ్మాయిల నోట వెంట వచ్చే కోపపు పిలుపే "స్టుపిడ్". అయితే ఈ పిలుపును దేశముదురు అబ్బాయిలు "క్యుపిడ్"గా భావించి వేధిస్తూనే ఉంటారు. అదేమని అడిగితే క్యుపిడ్ ప్రకృతి... స్టుపిడ్ వికృతి అనీ, వికృతులను తాము పట్టించుకోమనీ చెప్పేస్తారు. ఇంతకీ క్యుపిడ్ అంటే ఏమిటో చెప్పలేదు కదూ.
క్యుపిడ్ అనే ఈ ఇంగ్లీషు పదానికి తెలుగులో మన్మథుడు అని అర్థం. సో... దీని నుంచే స్టుపిడ్ పుట్టిందని కొందరు ప్రేమ బాధితులు చెపుతుంటారు. ఏదేమైనా స్టుపిడ్ అని పిలిచినా క్యుపిడ్ అనుకుంటూ అమ్మాయిలను వేధించే అబ్బాయిలు నిఖార్సయిన స్టుపిడ్xస్టుపిడ్= స్టుపిడ్ స్వ్కేర్ రకాలని ఓ లవ్‌లెస్ బాధితురాలు చెప్పింది.