సుందరీ, సుబ్బారావులకు వివాహమై ఆ రోజుకు పాతిక సంవత్సరాలు అయ్యింది. పెళ్ళి రోజును ఇద్దరు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. రోజంతా షికార్లు కొట్టి, రాత్రికి స్టార్ హోటల్‌లో భోజనం చేసి ఇంటికి చేరుకున్నారు సుందరీ, సుబ్బారావులు. పండు వెన్నెల విరగ కాస్తుండగా ఇద్దరు మేడ మీదకు చేరుకున్నారు.
ఇద్దరి మనస్సుల్లో ఒక్కసారిగా పాతికేళ్ళ తమ వైవాహిక జీవితం సినిమా రీలులా గిర్రున తిరిగింది. సుందరిని తనవైపుకు తిప్పుకుని అడిగాడు సుబ్బారావు. "సుందరీ ఈ పాతికేళ్లలో నీపై నాకు అపనమ్మకం కలిగేలా ప్రవర్తించావా?" అని అడిగాడు.
"ఆ... గుర్తొచ్చిందండీ... మీరు చేస్తున్న ఉద్యోగం ఊడిపోవడంతో, ఇంటి మీద తీసుకున్న అప్పు తీర్చమంటూ బ్యాంకు వాళ్లు మీ వెంట పడ్డారు. అప్పుడు నేను వెళ్లి బ్యాంక్ మేనేజర్‌ను కలుసుకున్నాను. అంతే... మళ్లీ మీకు మరో ఉద్యోగం దొరికేంతవరకు బ్యాంకు వాళ్లు అప్పు సంగతి ఎత్తలేదు". చెప్పింది సుందరి.
"భలేదానివే సుందరీ... నువ్వు మన ఇళ్లు కాపాడావు. నీ మీద అపనమ్మకం ఎందుకు కలుగుతుంది. ఇంకేదైనా ఉంటే చెప్పు" అడిగాడు సుబ్బారావు. మరెమోనండీ... ఒకసారి మీరు మన కాలనీ ప్రెసిడెంట్‌గా నిలబడ్డారు. అప్పుడు మీకు 25 ఓట్లు అవసరమయితేనూ...." సుందరి మాట పూర్తి కాకమునపే విరుచుకుపడిపోయాడు సుబ్బారావు.