మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గానికి భారతీయ జనతా పార్టీ తేరుకోలేని షాకిచ్చింది. అమరావతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా నవనీత్ రాణాను బరిలోకి దించింది. గత రెండు ఎన్నికల్లో ఈ స్థానాన్ని శివసేనకు బీజేపీకి వదిలిపెట్టింది. కానీ, ఈ దఫా ఎన్నికల్లో మాత్రం శివసేన రెండుగా విడిపోవడంతో షిండే వర్గం ఆ సీటును తమకు దక్కుతుందని భావించింది. కానీ, కమలనాథులు తమ వద్దే ఉంచుకుని నవనీత్ కౌర్‌ను అభ్యర్థిగా బరిలోకి దించారు.
గత 2019 ఎన్నికల్లో ఎన్సీపీ మద్దతు స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన నవనీత్ రాణా ఐదేళ్ల తర్వాత ఇటీవల బీజేపీలో చేరారు. మరోవైపు, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణే కూడా బడ్నేరా అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఇక 2022లో అప్పటి సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా చదువుతానంటూ సంచలనం సృష్టించిన నవనీత్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆ స్థానాన్ని తమకు కేటాయిస్తారని షిండే వర్గం ఎన్నో ఆశలుపెట్టుకుంది. కానీ, బీజేపీ మాత్రం నవనీత్ రాణాకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో షిండే వర్గం షాక్‌కు గురైంది.
బీజేపీ నేత - కాంగ్రెస్ మహిళా నేతకు ఈసీ నోటీసులు
భారతీయ జనతా పార్టీ నేత దిలీప్ ఘోష్, కాంగ్రెస్ మహిళా నేత, ఆ పార్టీ ప్రతినిధి సుప్రియ శ్రీనతేకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. వీరిద్దరూ తమతమ ప్రత్యర్థులపై చేసిన వ్యాఖ్యలు అమర్యాదరకరమైనవని తమ ప్రాథమిక పరిశీలనలో తేలినట్టు ఈసీ పేర్కొంటూ నోటీసులు జారీచేసింది. పైగా, వారిద్దరిపై చర్యలు ఎందుకు తీసుకోరాదో చెప్పాలని కోరింది. ఈ నోటీసులపై మార్చి 29 సాయంత్రం 5 గంటల లోపు స్పందించాలని ఆదేశించింది. నోటీసులకు స్పందించని పక్షంలో వారు చెప్పేందుకు ఏమీ లేదని భావించి చట్టపరంగా తగు చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ మేరకు ఇరు నేతలకు విడివిడిగా నోటీసులు జారీ చేసింది.
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ నేత దిలీప్ ఘోష్ అమర్యాదకర వ్యాఖ్యలు చేసినందుకు ఆ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఆయన వ్యాఖ్యలు అభ్యంతరకమని, అవమానకరమని పేర్కొంది. ఈ వ్యాఖ్యలు మీడియాలో కూడా విస్తృతంగా ప్రసారమయ్యాయని చెప్పుకొచ్చింది. మమతా బెనర్జీ కుటుంబనేపథ్యాన్ని అవమానిస్తూ దిలీప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పేర్కొంది.
మరోవైపు, బీజేపీ తరపున బరిలోకి దిగిన సినీ నటి కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనతే చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం రేపాయి. ఆమె సోషల్ మీడియా పేజీలో కంగన ఫొటోతో పాటు క్యాప్షన్ 'మార్కెట్లో ప్రస్తుతం రేటు ఎంత' అన్న క్యాప్షన్ కనిపించడం తీవ్ర దుమారానికి కారణమయ్యాయి.
అయితే, దిలీప్, శ్రీనతే ఇద్దరూ తమ వివరణ ఇచ్చారు. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న మమతపై రాజకీయ వ్యాఖ్యలు మాత్రమే చేశానని, తనకు ఆమెతో ఎటువంటి వ్యక్తిగత వైరం, ద్వేషం లేవని దిలీప్ ఘోష్ అన్నారు. మరోవైపు, తన పేజీకి అనేక మందికి యాక్సెస్ ఉన్నందున వారిలో ఎవరో ఈ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని శ్రీనతే వివరణ ఇచ్చారు. అయితే, వీటిని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోని ఈసీ వారికి ఈ నోటీసులు జారీచేసింది.