జాతిపిత మహాత్మా గాంధీని కాల్చి చంపిన నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతా పార్టీకి చెందిన భోపాల్ లోక్‌సభ అభ్యర్థి సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాడ్సేను దేశభక్తుడుగా పోల్చిన సాధ్వీని క్షమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, బాపూను అవమానించిన ప్రజ్ఞాను తానెప్పటికీ క్షమించనన్నారు. కానీ ఆమె మాత్రం భోపాల్ నుంచి బీజేపీ అభ్యర్థిగానే పోటీ చేస్తారన్నారు. అంతకుముందు మధ్యప్రదేశ్‌లో ఓ సభలో మోడీ మాట్లాడారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, కచ్ నుంచి కామ్‌రూప్ వరకు అందరూ బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. అబ్ కీ బార్.. 300 పార్ అని నినాదాలు చేస్తున్నారని తెలిపారు.
ప్రపంచాన్ని శాసించేవిధంగా మనం ఎదగాలన్నారు. ప్రభుత్వం దగ్గర సత్తా ఉంటే, ఎన్నికలు.. ఐపీఎల్ టోర్నీ ఒకేసారి జరగడం సాధ్యం అవుతుందన్నారు. గత రెండు సార్లు ప్రభుత్వాలు.. ఎన్నికల వేళ ఐపీఎల్ నిర్వహించలేకపోయాయన్నారు. ప్రభుత్వం బలంగా ఉంటే.. ఐపీఎల్, రంజాన్, పరీక్షలు అన్నీ సవ్యంగా సాగుతాయని గుర్తుచేశారు.
అధికారంలో ఉన్న ప్రభుత్వం పూర్తి మెజారిటీతో రెండోసారి మళ్లీ అధికారంలోకి రాలేదు, కానీ ఈసారి అదిసాధ్యం కాబోతుందని అన్నారు. తమ పార్టీ మరింత పెద్ద మెజారిటీతో మళ్లీ 2019లో అధికారంలోకి వస్తుందన్నారు. 2014లో ఎన్నికల ఫలితాలు మే 16వ తేదీన వచ్చాయని, మే 17వ తేదీన భారీ నష్టం జరిగిందని, ఈ రోజు కూడా మే 17వ తేదీ అని, కాంగ్రెస్ గెలుస్తుందని బెట్టింగ్ పెట్టినవాళ్లంతా భారీ నష్టాన్ని చవిచూశారన్నారు.