కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా లోక్‌సభ స్థానంలో సినీ నటుడు దివంగత అంబరీష్ భార్య, సినీ నటి సుమలత పోటీ చేస్తోంది. ఈమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆమెకు భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ నిరాకరించండంతో సుమలత ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగడం ఈ పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు, ఇదే నియోజకవర్గం నుంచి జేడీ(ఎస్) యువనేత, నటుడు నిఖిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీకి సిద్ధపడ్డారు. ఇక్కడ బీజేపీ అండతో విజయం సాధించాలని సుమలత గట్టిగా ప్రయత్నిస్తోంది. దీంతో ఈ స్థానంలో పోటీ రసవత్తరంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఇదే నియోజకవర్గం నుంచి సుమలత అనే పేరున్న మరో ముగ్గురు కూడా నామినేషన్లు దాఖలు చేశారు.
కనకపుర ప్రాంతానికి చెందిన పి.సుమలత, శ్రీరంగపట్నం ప్రాంతానికి చెందిన సుమలత, కేఆర్.పేట్ తాలూకాకు చెందిన ఎం.సుమలత పోటీలో ఉన్నారు. వీరు ముగ్గురూ స్వతంత్ర అభ్యర్థులుగానే బరిలో ఉన్నప్పటికీ, ఈవీఎంలలో సుమలత అన్న పేర్లన్నీ ఒకే చోట ఉండటంతో ఓటర్లు, అయోమయంలో పడే అవకాశాలు ఉన్నాయి.
ఎన్నికల సందర్భంగా ఓ బలమైన అభ్యర్థిని ఓడించాలన్న ఉద్దేశంతో ఈ తరహాలో ఒకే పేరున్న వాళ్లను రంగంలోకి దించడం సర్వ సాధారణమే. ఓటర్లను గందరగోళపరిచే ఉద్దేశంతోనే ఈ తరహా కుట్రలు చేస్తున్నారని సుమలత వర్గం ఆరోపిస్తోంది. ఓటర్లంతా సుమలత ఫోటోను చూసి మాత్రమే ఓటు వేయాలని వారు ప్రజలకు చెబుతున్నారు.