కేంద్రంలో ఉన్న ఇలాంటి బలహీన ప్రభుత్వం, బలహీన ప్రధానిని ఇదివరకెన్నడూ తాను చూడలేదని.. ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీని, ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ తూర్పు ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ప్రియాంకా గాంధీ వాద్రా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఆమె సోదరుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న కేరళలోని వయనాడ్ జిల్లాలోని పూలపల్లిలో ప్రియాంక శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వయనాడ్ సోదరీమణులు మరియు సోదరులారా.. నేను ఇప్పుడున్న ప్రభుత్వంలాంటి బలహీన ప్రభుత్వాన్ని, ఇప్పుడున్న ప్రధాని వంటి బలహీన ప్రధానిని గతంలో ఎన్నడూ చూడలేదు.
ప్రజల కోసం పాటుపడే ప్రభుత్వం ఇప్పుడు మీకు కావాలి. ప్రభుత్వానికి వ్యతిరేకమైనప్పటికీ.. ప్రజల గొంతుకను వినిపించేందుకు అవకాశమిచ్చే ప్రభుత్వం ఇప్పుడు రావాలి. ప్రజలను గౌరవిస్తూ.. చేసిన వాగ్దానాలను నిలుపుకునే ప్రధాని ఇప్పుడు మీకు అవసరం అని వ్యాఖ్యానించారు. ప్రజల్ని విడగొట్టాలని వాళ్ళు(బీజేపీ) ప్రయత్నిస్తున్నారు. తమ కష్టాలను చెప్పుకోవడానికి దేశం నలుమూలల నుంచి రైతులు మీ దగ్గరకు (ఢిల్లీకి) వస్తే, వాళ్ళ విన్నపాలను వినిపించుకోకుండా తరిమికొట్టారని దుయ్యబట్టారు.
మీ ప్రభుత్వాన్ని, మీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలియజేసిన ప్రజలపై దాడి చేసి, జైల్లో పెట్టారు. దీన్ని జాతీయవాదం అంటారా? అంటూ ప్రియాంక నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో పాకిస్థాన్ గురించి మాట్లాడుతారు తప్ప, ప్రజలకు ఏం చేస్తారు? ఇచ్చిన వాగ్దానాలను ఎంత వరకు నెరవేర్చారు అనే విషయాలను చెప్పరని బీజేపీ నేతలను ఉద్దేశిస్తూ ఆమె ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం ప్రజలను నిలువునా మోసం చేసిందని ఆరోపించారు. గత ఐదేండ్లలో బీజేపీ ప్రభుత్వం చేసిందల్లా దేశాన్ని ముక్కలు చేయడమేనన్నారు.