Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వారణాసిలో నరేంద్ర మోడీ ప్రత్యర్థి ఎవరంటే...

వారణాసిలో నరేంద్ర మోడీ ప్రత్యర్థి ఎవరంటే...
, గురువారం, 25 ఏప్రియల్ 2019 (16:12 IST)
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వారణాసి లోక్‌సభ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేయనున్నారు. ఈయన ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున ప్రియాంకా గాంధీ పోటీ చేస్తారనే ప్రచారం సాగింది. ఈ విషయంపై కూడా కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో గురువారం కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థి పేరును వెల్లడించారు. ఆయన పేరు అజయ్ రాయ్. 
 
2014 ఎన్నికల్లో మోడీపై పోటీ చేసిన అజయ్‌ రాయ్‌నే మరోసారి బరిలోకి దింపింది కాంగ్రెస్‌ పార్టీ. అసలు అజయ్‌ రాయ్‌ ఎవరు? అనే విషయంపై అందరికీ ఆసక్తి నెలకొంది. 2014 ఎన్నికల్లో వారణాసి నుంచి కాంగ్రెస్‌ తరపున పోటీ చేసిన అజయ్‌ రాయ్‌ 75 వేల ఓట్లతో మూడో స్థానంలో నిలిచాడు. మొదటి స్థానంలో నరేంద్ర మోడీ నిలువగా, రెండో స్థానంలో అరవింద్‌ కేజ్రీవాల్‌ నిలిచాడు. 
 
భూమిహార్‌ కమ్యూనిటీకి చెందిన అజయ్‌ రాయ్‌ తన రాజకీయ ప్రస్థానాన్ని భారతీయ జనతా పార్టీ స్టూడెంట్‌ విభాగం మెంబర్‌గా ప్రారంభించారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1996 -2007 మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్‌లోని కోలసాల నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 
 
ఈ మూడుసార్లు బీజేపీ తరపునే ఆయన గెలుపొందారు. 2009 సాధారణ ఎన్నికల్లో అజయ్‌కు బీజేపీ టికెట్‌ నిరాకరించడంతో సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఏకంగా బీజేపీ అగ్ర నాయకుడైన మురళీ మనోహర్‌ జోషిపైనే లోక్‌సభకు అజయ్‌ పోటీ చేసి ఓడిపోయారు. అదే యేడాది స్వతంత్ర అభ్యర్థిగా మళ్లీ కోలసాల నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. 
 
ఇక 2012 అసెంబ్లీ ఎన్నికల్లో అజయ్‌ కాంగ్రెస్‌ తరపున పింద్రా నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2017 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అవదీష్‌ సింగ్‌ చేతిలో అజయ్‌ రాయ్‌ ఓటమి పాలయ్యారు. 2014లో మోడీ చేతిలో ఓటమి పాలైన అజయ్‌ రాయ్‌.. మరోసారి వారణాసి నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. వారణాసి నుంచి ఎస్పీ - బీఎస్పీ కూటమి నుంచి షాలినీ యాదవ్‌ పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గానికి మే 19న ఎన్నికలు జరగనున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోగొట్టుకున్న ఫోన్‌ను తెచ్చిస్తే రూ. 4 లక్షల బహుమతి... ఎక్కడ?