సృష్టికి మూలం భగవంతుడని చెబుతారు.. అయితే ఇందుకు సరైన శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ చాలా మంది దీనిని విశ్వసిస్తారు. సరే ఇది అలా ఉంచితే.. మానవ సృష్టికి మాత్రం తల్లిదండ్రలే మూలం. వారే లేకపోతే ఈ రోజు మనం ఈ భూమి మీద ఉండే వాళ్లం కాదనే విషయాన్ని గ్రహించాలి. మనం తల్లి ఒడిలో మాటలు నేర్చితే.. తండ్రి నీడలో.. నడకలు నేర్చుతాం.
వారు తమ పిల్లలకు ఇవ్వడమే తప్ప పిల్లల నుంచి ఆశించేదేమీ ఉండదు. వారు ఆశించలేదు కదా అని పిల్లలు ఏమీ ఇవ్వకుండా ఉండకూడదు. తల్లిదండ్రులకు వయస్సు మళ్లిన తర్వాత వారు మనకు పిల్లలు లాంటి వారే అనే వాస్తవాన్ని గ్రహించాలి. మరి నేటి సమాజం ఎలా ఉంది..? ఏ దారిలో వెళ్తోంది..? ఇందుకు ఓ చక్కని ఉదాహరణ చెప్పుకోవాలి.
ఒక రోజు ఓ 50 ఏళ్ల తండ్రి తన పాతికేళ్ల కుమారుడితో కలిసి ఓ పార్కులో కూర్చుని ఉన్నాడు. అప్పుడు పక్కనే ఉన్న చెట్టు కొమ్మపై ఓ పక్షి వచ్చి వాలింది. అప్పుడు తండ్రి తన కుమారుడితో దానిని చూపించి "బాబు అదేంటి" అని అడిగాడు. అప్పుడు కుమారుడు "అది 'కాకి' నాన్న" అని చెప్పాడు. అనంతరం తండ్రి మరోసారి తన కుమారుడితో ఆ పక్షిని చూపించి అదేంటి అని అడిగాడు.
కానీ.. ఇప్పుడు మాత్రం కుమారుడు చిరాకుతో "ఇందాకే చెప్పాను కదా నాన్న అది కాకి" అని అన్నాడు. అయితే తండ్రి మూడోసారి కూడా అడిగాడు బాబు అదేంటి అని... ఈ సారి కుమారుడికి బాగా కోపం వచ్చి "ఎన్ని సార్లు చెప్పాలి నాన్న అది కాకి" అని విసుక్కుంటూ అన్నాడు.
అప్పుడు తండ్రి చిన్న చిరు నవ్వుతో ఇలా అన్నాడు.. "బాబు నీకు మూడేళ్ల వయస్సు అప్పుడు నన్ను ఇదే ప్రశ్న 300 సార్లు అడిగావు. నువ్వు అడిగిన ప్రతిసారి నేను నీకు నవ్వుతూ సమాధానం చెప్పాను. కానీ.. ఇప్పుడు నిన్ను మూడు సార్లు అడిగేసరికి విసుక్కుంటున్నావు. అది తల్లిదండ్రులు పిల్లల మీద చూపించే.. ప్రేమ. ఇది పిల్లలు తల్లిదండ్రుల మీద చూపించే ప్రేమ" అని చెప్పాడు.
ఎంత చక్కటి ఉదాహరణ కదా..!! మరి నేటి తరం పిల్లలలో కొంత మంది కాస్త.. తమ కాళ్ల మీద తాము నిలబడే స్థాయి వచ్చేసరికి వారు తల్లిదండ్రులను విస్మరిస్తున్నారు. అమ్మ కడుపుకోత, నాన్న గుండెకోత వారికి కనిపించడం లేదు. చివరి దశలో తమ పిల్లలే తమకు కొండంత అండగా నిలుస్తారని భావించే వారి ఆశలు అడియాశలుగానే మిగిలిపోతున్నాయి.
ఎక్కువ మంది పిల్లలు ప్రశ్నించే ప్రశ్న.. మాకేం ఇచ్చారు..? అని. ఏం ఇవ్వాలి జన్మనిచ్చారు చాలదా..? ఆ జన్మకు సార్ధకత నిరూపించుకోవాల్సిన బాధ్యత మీది కాదా..? ఆస్తి కోసం కసాయిగా మారి కన్న తల్లినే హతమారుస్తాడు ఒకడు. ఆప్యాయంగా చూసుకోవాల్సిన తండ్రినే ఇంటి నుంచి గెంటి వేస్తాడు మరొకడు. సభ్య సమాజం తలనిందించుకునేలా ప్రవర్తిస్తాడు వేరొకడు.
"జన్మ"నిచ్చిన తల్లిదండ్రులను విస్మరించిన వారి "జన్మ"కు సార్ధకత ఉండదు. కడ దశలో వారికి కావలసింది కాసులు కాదు. చిన్నతంలో మీపై వారు చూపించిన ప్రేమలో ఒక్క శాతం వారిపై చూపిస్తే చాలు. వారి సంతోషానికి అవధులు ఉండవు. కాబట్టి తల్లిదడ్రులను ప్రేమించండి. వారు దైవంతో సమానం.. పూజించండి. వారు గురువుతో సమానం.. గౌరవించండి.