ఘనుడగునట్టివాడు నిజకార్యసముద్ధరణార్థమై మహిం
బనిపడి యల్పమానవుని బ్రార్థనచేయుట తప్పు గాదుగా
యనఘత గృష్ణజన్మమున నావసుదేవుడు మీ దుటెత్తుగా
గనుగొని గాలిగానికడ కాళ్లకు మ్రొక్కడె నాడు భాస్కరా...
అర్థం: వసుదేవుడు ఒకానొక చంద్రవంశపురాజు. బలరామకృష్ణుల తండ్రి. కంసుని బావమఱది. ఈయన భార్యయగు దేవకీదేవితో కూడ కంసుని చెఱలో నుండగా నీతనికి శ్రీకృష్ణుడు జన్మించెను. అప్పటికే దేవకికి పుట్టిన ఏడుగుర్ని చంపేశాడు కంసుడు. కృష్ణనైనను వారు దక్కించుకొనదలచి, వసుదేవుడర్థరాత్రమున ఖైదు వెడలి శ్రీకృష్ణుని తీసికొని పోవుచుండగా నొక గాడిద వానిని చూసి ఓండ్ర పెట్టసాగెను.
అందుచే తన రహస్యము బట్టబయలగునేమోనని వసుదేవుడు గాడిదను ప్రార్థించి, తన పనిని నెరవేర్చుకొనెను. కావున, ఎంత గొప్పవాడైనను తన కార్యము నిర్వహించుకొనుటకు నీచుని ప్రార్థించినమో తప్పలేదు.