పిల్లలపై అతిమోహం...! ఏమవుతుందో తెలుసా..?!!
శూరసేనుడనే మహారాజు చాలా గొప్పవాడు. అతడు తన రాజ్యంలోని ప్రజలందరినీ కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ఇతని పరిపాలనలో రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేది. ప్రజలు ఎవరి వృత్తులను వారు సక్రమంగా చేసుకునేవారు. అలా పరిపాల
శూరసేనుడనే మహారాజు చాలా గొప్పవాడు. అతడు తన రాజ్యంలోని ప్రజలందరినీ కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ఇతని పరిపాలనలో రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేది. ప్రజలు ఎవరి వృత్తులను వారు సక్రమంగా చేసుకునేవారు. అలా పరిపాలిస్తున్న మహారాజుకు ఓ కోరిక కలిగింది. గొంగళి పురుగు సీతాకోకచిలుక ఎలా అవుతుందో చూడాలి అనుకున్నాడు. తన ఉద్యానవనంలో కొన్ని చెట్లకి గొంగళి పురుగులు ఉండటం చూసి పంట పండింది అనుకుని రోజు వచ్చి చూస్తూ ఉండేవాడు. ఒకరోజు గూడు కట్టుకొని ఉండేవి. మరలా వచ్చి చూసేసరికి సీతాకోకచిలుకలై ఎగిరిపోతూ ఉండేవి.
ఇలా చాలా రోజులు ప్రయత్నించాడు. కాని ఎప్పుడు సీతాకోక చిలుక పుట్టుక మాత్రం చూడలేకపోయేవాడు. ఒకనాడు మంత్రి గారిని పిలిచి తన మనస్సులో కోరికను వెల్లడించాడు. మంత్రి విని వెంటనే ఆ గొంగళి పురుగులు ఉన్న చెట్టు దగ్గర భటులను నియమించి ''సీతాకోక చిలుక పుట్టే సమయాన్ని మాకు తెలియజేయండి అని ఆదేశించాడు. భటులు అలాగే అని గొంగళిపురుగులు ఉన్న చెట్టు దగ్గర కాపలా కాచి సీతాకోకచిలుక పుట్టే సమయాన్ని మంత్రిగారికి తెలియజేయగా, హుటాహుటిన రాజుగారిని వెంట బెట్టుకొని ఉద్యానవనానికి వెళ్ళాడు. సరిగ్గా అదే సమయానికి గూడులో నుండి సీతాకోకచిలుక బయటికి రావడం మొదలైంది.
రాజుగారు ఎంతో ఆసక్తిగా చూడటం మొదలుపెట్టాడు. గూడులో నుండి మెల్లమెల్లగా బయటికి రావడం మహారాజు చూసి, అయ్యో! ఎంత కష్టపడుతుందో! పాపం అనుకుని దగ్గరికి వెళ్లి ఆ గూడుని తన దగ్గర ఉన్న చాకుతో చిన్నగా, సీతకోకచిలుకకి ఏమి కాకుండా కోశాడు. అది బయటికి వచ్చి క్రింద పడిపోయి గిలగిలా కొట్టుకుంటుంది. అది చూసి అయ్యయ్యో ఇది ఎగరలేకపోతుంది అని తన చేతుల్లోకి తీసుకొని పైకి ఎగరేశాడు. అయినా అది ఎగరలేక క్రిందపడిపోయి ఎగరడానికి ప్రయత్నిస్తుంది. కాని రెక్కలు విచ్చుకోకపోవడంతో అలా తన్నుకొని తన్నుకొని చనిపోయింది. అది చూసిన మహారాజు దుఃఖించాడు.
మంత్రివర్యా! ఏమిటి ఇలా జరిగింది. ఎందుకలా చనిపోయింది? అని అడిగాడు. అప్పుడు మంత్రిగారు ఇలా అన్నారు. మహరాజా! సృష్టిలో ప్రతీదీ తనకు తానుగా ఎదగడానికి ప్రయత్నించాలి. అప్పుడే తన సామర్థ్యం ఏమిటో తెలుస్తుంది. ఒక విద్యార్థి విద్య నేర్చుకునేటప్పుడు గురువు శిక్షిస్తాడు. అలాగని గురువుకి శిష్యుడి మీద కోపం ఉంటుంది అనుకోకూడదు. తనను మంచి మార్గంలో పెడుతున్నాడు. శిక్షించకపోతేనే ప్రమాదం. విచ్చలవిడితనం పెరుగుతుంది. సర్వనాశనం అవుతాడు. అలాగే ప్రకృతికి లోబడి జీవులు బ్రతకాలి. మీరు ఏదో సహాయం చేద్దాం అనుకున్నారు. అది కష్టపడుతుంది అనుకుని మీరు సాయం చేయబోయారు. చివరికి చనిపోయింది. ఇదిగో దీన్ని చూడండి అని మరొక సీతాకోకచిలుక బయటికి రావడం చూపించాడు. రాజు గారు మళ్ళీ దానిని బయటికి తీయడానికి వెళ్లబోతుంటే మంత్రి ఆపి, మహారాజా! ఏం జరుగుతుందో చూడండి అని అక్కడే నిలబెట్టేశాడు.
సీతాకోకచిలుక తన చుట్టూ ఉన్న వలయాన్ని చీల్చుకువచ్చి రివ్వున ఆకాశానికి ఎగిరింది. అప్పుడు! మహారాజా! చూశారా! ఇది ప్రకృతి సహజంగా తనకు తానుగా పోరాడి బయటికి రావడం వలన తన ఇంద్రియాలలో బలం పెరిగింది. దానివలన దాని రెక్కలు పటిష్ఠమై ఎగరడానికి సహాయపడ్డాయి. ఇంతకు మునుపు మీరు అది ఎక్కడ కష్టపడుతుందో అని, కష్టపడకుండా సుఖపెట్టాలని వలయాన్ని చీల్చేసారు. దానివలన సీతకోకచిలుకకి కష్టపడాల్సిన పనిలేక బలం సరిపోక రెక్కలలో బలం చాలక ఎగరలేక చనిపోయింది. అర్థమైందా మహారాజా! ప్రతి జీవికి పరమాత్మ స్వయంశక్తిని ఇచ్చాడు. దానిని ఎవరికివారిని తెలుసుకోనివ్వాలి.
అలాకాకుండా ఎక్కడ కష్టపడతారో అని ఆ జీవి కష్టం కూడా మనమే పడితే ఇదిగో అనవసరంగా నాశనం చేసినవారం అవుతాము. అని చెప్పగా మంత్రిగారికి కృతజ్ఞతలు తెలియజేసి సన్మానించి బహుమతులు ఇచ్చాడు. దీనిని ఆదర్శంగా తీసుకొని ఇంకొంత పరిపాలనకు వాడుకున్నాడు. ఈ కథ ఇప్పటి తల్లిదండ్రులకు సరిగ్గా అతికినట్లు సరిపోతుంది. పిల్లలు కష్టపడకూడదు అని కొందరు. పిల్లల్ని మాష్టారు కొడితే ఆ మష్టారినే తన్నిన పనికిమాలిన నీచమైన తల్లిదండ్రులు కొందరు ఉన్నారు. ఇలా పిల్లలపై ప్రేమ పిల్లల నాశనానికే దారి తీస్తుంది తప్ప వికాసానికి దారితీయదు. కాబట్టి పిల్లలను స్వతహాగా ఎదిగేలా తీర్చిదిద్దాలి. ప్రతి విషయాన్ని మనమే దగ్గరుండి నడిపించాలని అనుకోరాదు.