జీవితం సాగించాలంటే అడుగడుగునా అవరోధాలు ఎదురవుతుండటం సహజమే. అందుకే ఇంట్లోని పెద్దలు అప్పుడుడప్పుడూ "అష్టకష్టాలు పడుతున్నాం, ఈ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు భగవంతుడా..!" అంటూ వాపోతుండటం చిన్నారులు వినే వింటారు. ఆ అష్టకష్టాలు అనేవి ఏంటో భర్తృహరి తన సుభాషితాల్లో ప్రస్తావించారు. పైన పేర్కొన్న పద్యం ఆయన సుభాషితాల్లోనిదే..!
తాత్పర్యం : అప్పులు చేయాల్సి రావటం, బ్రతుకుదెరువు కోసం యాచన చేయాల్సి రావటం, ముసలితనంలో అన్నిటికీ ఇతరులపై ఆధారపడటం, జారత్వంవల్ల అవమానాలు ఎదుర్కోవటం, దొంగతనాలు చేసి అపవాదులు పడటం, పేదరికంలో మగ్గటం, రోగాల బారిన పడటం, ఎంగిలి అయినా తిని ప్రాణం నిలబెట్టుకోవాల్సి రావటం... లాంటివే అష్టకష్టాలు. వీటిని వినేందుకే కష్టంగా ఉంటుంది ఎవరికైనా.. అందుకే ఇవి పగవాడికి కూడా రాకూడదని ప్రజలు కోరుకుంటారని ఈ పద్యం భావం.