తనువు ఎవరి సొమ్ము తనదని పోషించ
ధనము ఎవరి సొమ్ము దాచికొనగ
ప్రాణము ఎవరి సొమ్ము పాయకుండగ
విశ్వదాభిరామ వినుర వేమ..!
తాత్పర్యం :
ఈ శరీరము ఎవరి సొమ్ము, ఈ ధనము ఎవరిది, ప్రాణము ఎవరి సొమ్ము అని పోకుండా నిలుపగలము? అంటే... మనం పుట్టేటప్పుడు మన వెంట ఏదీ తీసుకుని రాలేదు. అలాగే పోయేటప్పుడు కూడా మనం ఏదీ తీసుకుని పోయేది లేదు. కానీ ఆ మధ్యలో ఉండే జీవితం అంతా శరీరాన్ని పోషిస్తూ, మంచి మంచి బట్టలు వేసుకుంటూ, డబ్బు సంపాదన వెంట పరుగులు తీస్తూ ఉంటాడు మానవుడు.
కాబట్టి... మనిషి తామరాకు మీద నీటి బొట్టులా ఉంటూ జీవితాన్ని గడపాలి. దేవున్ని స్మరిస్తూ తన జీవితాన్ని జీవించాలే కానీ, ఎండమావుల వెంట పరుగులు తీయరాదని ఈ పద్యం యొక్క భావం.