దేశంలోనే అతిచిన్న అవయవదాతగా అభిలాష
పట్టుమని 16 నెలలైనా నిండకనే అవయవ దానం
పుట్టిన పదిహేను రోజులకే కామెర్ల బారిన పడిన భోపాల్‌కు చెందిన అభిలాష... పట్టుమని పదహారు నెలలైనా నిండకముందే తన అవయవాలను దానం చేసి చిరంజీవిగా మిగిలింది. దీంతో ఆమె దేశంలోనే అతిపిన్న అవయవదాతగా రికార్డు సృష్టించినట్లు అపోలో ఆసుపత్రుల ఛైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి తెలిపారు.
వివరాల్లోకి వస్తే... భోపాల్‌కు చెందిన రాజేంద్ర రహష్త్రరికర్, వినీతల సంతానం అభిలాష. పుట్టిన పదిహేను రోజులకే కామెర్ల బారిన పడ్డ ఈ చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. "బిలియారీ అట్రీసియా" అనే అరుదైన వ్యాధితో బాధపడుతోందని వైద్యులు గుర్తించారు. దీనివల్ల ఆ చిన్నారి కాలేయానికీ-పేగుకు మధ్య సంబంధం లేకపోవడంతో శరీర ద్రవాలన్నీ కాలేయంలోనే పేరుకుపోతున్నట్లు వైద్యులు కనుగొన్నారు.
మూడు నెలల తరువాత అభిలాషకు బెంగళూరులో ఆపరేషన్ నిర్వహించగా.. పరిస్థితిలో తాత్కాలికంగా మెరుగుదల కనిపించడంతో, ఆమె తల్లిదండ్రుల ఆనందానికి అవధులే లేవు. అయితే, కామెర్లు మాత్రం తగ్గకపోవడంతో అభిలాష మృత్యువుకు దాసోహం అనక తప్పలేదు.
దీంతో భోరున విలపించిన అభిలాష తల్లిదండ్రులు.. పదిహేను సంవత్సరాల తరువాత, లేకలేక పుట్టిన తమ కుమార్తెను చిరంజీవిగా చూడాలన్న ఆకాంక్షతో ఆమె కళ్లు, కాలేయాలను దానం చేశారు. మరణం తరువాత కూడా అభిలాష జీవించాలని అనుకునే తాము అవయవదానం చేశామని.. అభిలాష తల్లి వినీత కన్నీటితో మీడియాకు వెల్లడించారు.