హాయ్ పిల్లలూ... ఎంచక్కా క్లాసు రూముల్లో అల్లరి చేస్తూ గడిపేయవచ్చులే అనుకుంటున్నట్లయితే.. ఇకపై ఆ ప్రయత్నాన్ని మానుకోండి సుమా..! ఎందుకంటే, మీరు అల్లరి చేస్తే "రోబో టీచర్" ఊరుకోదు మరి.. రోబో టీచర్ ఏంటి, ఊరుకోకపోవడం ఏంటి అని అనుకుంటున్నారా... నిజం పిల్లలూ...!
అచ్చంగా మనిషిని పోలి ఉండే ఈ "రోబో టీచర్" అందంగా చిరునవ్వుతో మిమ్మల్ని పలుకరించడమే కాకుండా, మీ హాజరును తీసుకోవడం, మీరు అల్లరి చేస్తుంటే.. సైలెన్స్ ప్లీజ్ అంటూ మందలించడం లాంటి పనులెన్నో చేసేస్తుందట. అన్నట్టు ఈ రోబో టీచర్‌ను జపాన్‌కు చెందిన టోక్యో యూనివర్సిటీ పరిశోధకులు ఈ "క్లాస్ రూం ఇన్స్ట్రక్టర్ రోబో (సాయా)"ను రూపొందించారట.
ఇది చూసేందుకు హోండా కంపెనీ తయారు చేసిన ఆసిమోలాగానే కనిపించినా.. అచ్చంగా మనిషిలాగానే హావభావాలు, ముఖకవళికలను ప్రదర్శించటం ఈ రోబో టీచర్ ప్రత్యేకత. ఆశ్చర్యం, భయం, అయిష్టం, కోపం, సంతోషం, విచారం లాంటి భావాలను సైతం ఈ రోబో ప్రదర్శించగలదు.
దీని కోసం రోబో ప్లాస్టిక్ చర్మం కింద తాము ప్రత్యేకంగా మోటార్లను అమర్చామనీ... ఇవి అవసరమైన చోట చర్మాన్ని బిగుతుగా, వదులుగా ఉండేటట్లు చేయడం వల్ల ముఖకవళిలకను ప్రదర్శించటం సాధ్యమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేగాకుండా, సంభాషణలకు అనుగుణంగా కనుబొమలు ఎగురవేయడం, కనుబొమలు ముడివేయటం, నొసలు చిట్లించటం లాంటి భావాలను కూడా ఈ రోబో ప్రదర్శించగలదని వారు వివరించారు.
ఇకపోతే... ఈ టీచర్ రోబో ముందుగానే రికార్డు చేసిన కొన్ని పదాలను మాత్రమే పలుకగలదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అచ్చంగా మనుషుల్లా ప్రవర్తించే రోబో (హ్యుమనాయిడ్)ల తయారీయే లక్ష్యంగా సాగుతున్న పరిశోధనల్లో "సాయా' ఒక మైలురాయి మాత్రమేనని వారు అంటున్నారు.
ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన, సాయా రూపకర్త అయిన హిరోషి కొబయాషి మాట్లాడుతూ... హావభావాలు పలికించటం, సంభాషణలకు అనుగుణంగా పెదాలను కదిలించటం, కొన్ని రికార్డు చేసిన పదాలను పలకడం తప్ప, ప్రస్తుతానికి ఈ రోబో ఇంకే పనీ చేయలేదని పేర్కొన్నారు. కాబట్టి, టీచర్ల ఉద్యోగాలకు వచ్చిన ముప్పేమీ లేదని ఆయన స్పష్టం చేశారు.