Publish Date: Mon, 15 Jun 2015 (15:23 IST)
Updated Date: Mon, 15 Jun 2015 (15:25 IST)
లేటు వయసు వివాహం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. అయితే లేటు వయసులో పెళ్లి, పిల్లలంటే లేనిపోని సమస్యలు తప్పవు. పిల్లలు ఎదిగే కొద్దీ వయసు మీద పడటం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తప్పవు. అందుకే లేటు వయసు వివాహాల్ని చాలామటుకు తగ్గించడం ఉత్తమం. 35 సంవత్సరాలు దాటిన తర్వాత తల్లిదండ్రులయ్యే వారికి పిల్లల భవిష్యత్‌తో పాటు వారి భద్రతపై కూడా ఆర్థిక సమస్యలు వేధిస్తునూ ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా పిల్లల భవిష్యత్‌పై లేటు వయస్సులో మ్యారేజ్ చేసుకున్న వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. 25 సంవత్సరాల వయసుతో పోలిస్తే 40 ఏళ్లంటే... సంపాదించే సమయం 15 ఏళ్లు తగ్గిపోయి వుంటుంది. చిన్నారుల భవిష్యత్ ఆందోళనకరం కాకుండా ఉండాలంటే, మరింత సమయం మించిపోకుండా సత్వర నిర్ణయాలు తీసుకోవాలన్నది నిపుణుల అభిప్రాయం.
లేటు వయసులో తల్లిదండ్రులైతే.. ఆ వెంటనే సాధ్యమైనంత ఎక్కువగా పొదుపు చేయడం ప్రారంభించాలి. లగ్జరీలను, టూర్లను తగ్గించుకోవాలి. ముఖ్యంగా యాత్రలు, విదేశీ ప్రయాణాల వంటివి లైఫ్ స్టయిల్ నుంచి తొలగించి ఆ మొత్తాన్ని పెట్టుబడిగా పెడితే, దీర్ఘకాలంలో ఆకర్షణీయ మొత్తంగా మారుతుంది. సంవత్సరానికి ఒకేసారి పెద్ద మొత్తం ప్రీమియాలు చెల్లించకుండా, వాటిని త్రైమాసిక, నెలసరి వాయిదాల రూపంలోకి మార్చుకుంటే, పెద్దగా భారం అనిపించదు.
రిస్క్ తీసుకోకుండా మార్కెట్లు, పెట్టుబడుల వైపు మొగ్గుచూపకపోవడం మంచిది. కాస్తంత తక్కువ రిటర్నులు వచ్చినా, ఫిక్సెడ్ డిపాజిట్లు వంటి సేఫ్ మార్గాలను ఎంచుకవాలి. స్టాక్ మార్కెట్ల వైపే వెళ్లాలని భావిస్తే మ్యూచువల్ ఫండ్స్‌ను నమ్ముకుంటే మేలు కలుగుతుంది. ముఖ్యంగా 60 సంవత్సరాలకు పదవీ విరమణ చేసినా, ఓపికుంటే డబ్బు సంపాదించేందుకు ఎన్నో పనులు చేసుకోవచ్చు.
పెద్దల అనుభవాన్ని తమ ఉద్యోగులకు పంచేందుకు ఎన్నో కార్పొరేట్లు రిటైర్ అయిన వారిని సలహాదారులుగా తీసుకుంటూ మంచి వేతనాలు ఇస్తున్నాయి. ఇక చివరిగా వీలునామా రాయడం మరవకూడదు. దురదృష్టవశాత్తూ, అనుకోని ఘటనలు జరిగితే, పిల్లలు ఆర్థిక ఇబ్బందులు పడకుండా, ఆస్తి పాస్తుల నుంచి బీమా సొమ్ము వరకూ ఎవరికి ఎంత చెందాలన్నది ముందే రాసి రిజిస్టర్ చేసుకుంటే మంచిదని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
Selvi
Publish Date: Mon, 15 Jun 2015 (15:23 IST)
Updated Date: Mon, 15 Jun 2015 (15:25 IST)