ఏంటీ మాకు కూడా హక్కులున్నాయా...? అయినా హక్కులంటే ఏంటి? అవి మాకెందుకు? అని అనుకుంటున్నారా..?. మనదేశంలో రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ కొన్ని రకాల హక్కులను కల్పించింది. ఇవి చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకూ చాలా అవసరం. సమాజంలోని ప్రతి తల్లిదండ్రులపైనా తమ బిడ్డల సంక్షేమ బాధ్యత ఉంటుంది. వారినుంచి తమకు అవసరమైన మౌలిక వసతులను పొందే హక్కు పిల్లలకూ ఉంటుంది. ధనిక పేద అనే తారతమ్యాలు లేకుండా పిల్లలు తమకు కావాల్సిన కనీస వసతులను సమకూర్చుకోగలిగినప్పుడే ఏ దేశపు భవిష్యత్తు అయినా ఉజ్జల్వంగా ఉంటుంది. |
పిల్లల ప్రత్యేక స్థాయి వల్ల వారికి మరింత అదనపు రక్షణ, మార్గదర్శకత పెద్దలనుండి అవసరమౌతుంది. దీని కోసం పిల్లలకు వారికంటూ కొన్ని ప్రత్యేక హక్కులున్నాయి. వీటినే పిల్లల హక్కులు అని అంటారు. వీటిలో ముఖ్యమైనవి విద్యా హక్కు, ప్రశ్నించేహక్కు, పౌష్టికాహారపు... |
|
|
ఇదిలా ఉంటే... మానవ హక్కులనేవి వయోబేధం లేకుండా అందరికీ వర్తిస్తాయి. కానీ, పిల్లల ప్రత్యేక స్థాయి వల్ల వారికి మరింత అదనపు రక్షణ, మార్గదర్శకత పెద్దలనుండి అవసరమౌతుంది. దీని కోసం పిల్లలకు వారికంటూ కొన్ని ప్రత్యేక హక్కులున్నాయి. వీటినే పిల్లల హక్కులు అని అంటారు.
ప్రతీ సమాజంలోనూ పిల్లలు లైంగికపరమైన హింసలకు గురి అవుతున్నారు. అంతేగాకుండా, చిన్న పిల్లలు కార్మిక వ్యవస్థలో మగ్గిపోయి, చదువుకు దూరంగా ఉంటున్నారు. వాళ్లలో ఎక్కువమంది వెట్టి చాకిరీ చేస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలను కొట్టడం, పాఠశాల గదులలో ఉపాధ్యాయులు పిల్లలను కొట్టడం లేదా వారి కులాన్ని, మతాన్ని చూసి వారి మధ్య వివక్షత చూపడం, బాలికలను పుట్టనివ్వక పోవడం, పుట్టగానే చంపేయటం... సమాజంలో బాలిలుగా పుట్టినందుకే వివక్షత నెదుర్కోవడం, బాల్య వివాహాలు లాంటివన్నీ పిల్లల హక్కులను కాలరాయడం కిందికే వస్తాయి.
భారత రాజ్యాంగం పిల్లలందరికీ కొన్ని ప్రత్యేక హక్కులను కల్పించింది. వాటిలో కొన్నింటిని ఇప్పుడు మనం చూద్దాం.
విద్యా హక్కు... సమాజంలోని పిల్లలందరికీ చదువుకునే హక్కు ఉంది. వారిని చదివించటమేకాదు, వారికి ప్రామాణికమైన చదువు, అవసరమైన పుస్తకాలు, ఇతర సాధనాలను సమాకూర్చాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉంది. అంతేగాకుండా... పరిశుభ్రమైన వాతావరణంతోపాటు అన్ని వసతులూ ఉన్న విద్యాలయాల్లో వారిని చదివించాలి. ఇవేమీ చేయకుండా వారిని పనిలో పెట్టడం వల్ల వారి చదివే హక్కును కాలరాయడమే అవుతుంది.
అలాగే తమ ఆరోగ్యాన్ని నిలబెట్టే ప్రామాణిక చికిత్సను పొందే హక్కు కూడా బాలలకు ఉంది. నిరంతరం ముక్కుతూ, మూల్గుతూ ఉండే అవస్థ కాకుండా, పరిపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే చికిత్సలు పొందే హక్కు వీరికి ఉంది. ఆ హక్కు నెరవేరేలా చూసే బాధ్యత తల్లిదండ్రులపైన, సమాజంపైనా ఉంటుంది.
ప్రశ్నించే హక్కు... పిల్లలు ఏదైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు ప్రశ్నిస్తారు. వారికా హక్కు ఉంది. బాలలు ప్రశ్నించటాన్ని తప్పుబట్టడం, ఆక్షేపించడం లాంటివి చేస్తే వారి హక్కులను కాలరాయటమే అవుతుంది. ప్రశ్నే మనిషి ఎదుగుదలకు గొప్ప సాధనమన్న విషయాన్ని మరువవద్దు. అలాగే, అర్థంకాని పాఠాన్ని, అందులోని సందేహాలను అడిగి తెలుసుకునే హక్కు పిల్లలకు ఉంది. ఆసందేహాలను తీర్చాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైన ఉంది.
పౌష్టికాహారపు హక్కు... దేశంలో ప్రస్తుతం అనేకమంది పిల్లలు పౌష్టికాహార లోపంత బాధపడుతున్నారు. సరైన తిండి లభించక అనారోగాల పాలబడుతున్న పిల్లలూ...! మీరు పౌష్టికాహారం పొందే హక్కును కలిగి ఉన్న సంగతిని మర్చిపోవద్దు. ధనిక, పేద అనే తేడా లేకుండా అందరికీ పౌష్టికాహారం తీసుకునే హక్కు ఉంది. పిల్లలకు ఇలాంటి హక్కు కూడా ఉందని తెలియక పోవడం వల్లనే చాలామంది తల్లిదండ్రులు సంతాన పరిమితిని పాటించటం లేదు. అంతేగాకుండా... ఏదో ఒకటి తిని బతికేస్తారులే అనే ధోరణితో వీరు వ్యవహరిస్తూ, పిల్లల పౌష్టికాహార హక్కును కాలరాస్తున్నారు.
ఏ దేశంలోనైనా, ఏ సాంఘిక వ్యవస్థలోనైనా, ఎలాంటి ఆర్థిక పరిస్థితుల్లోనైనా రాజ్యాంగపరంగా మానవహక్కులుగా పిల్లలకు సంక్రమించిన పై హక్కులను, కనీస వసతులు సమకూర్చాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు, ఆ సమాజానికి ఉంది. జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఆ బాధ్యతల నుండి తప్పించుకోవడానికి వీలు లేదు. వారు అలా చేసినట్లయితే బాలల హక్కులను ఉల్లంఘించటమే అవుతుంది. పిల్లలు స్వతంత్ర జీవనం గడపగలిగే ఒక పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని ఇవ్వాల్సిన బాధ్యత వారిపైన ఉంది.