Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"డిసెక్లిక్సియా" మగ పిల్లల్లోనే ఎక్కువగా వస్తుంటుందా..?

FILE
మార్కులు తక్కువగా వచ్చినా, చదివిన విషయాలను అర్థం చేసుకోవటంలో అలసత్వం ప్రదర్శించినా తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర పిల్లలతో పోల్చి చూడటం మొదలుపెడతారు. దీంతో పిల్లల్లో ఆత్మన్యూనతా భావం పెరిగిపోతుంది. అయితే "డిసెక్లిక్సియా" వ్యాధితో బాధపడే చిన్నారులే పై విధంగా ఉంటారన్న సంగతిని పెద్దలు అర్థం చేసుకోవాలి.

ఈ వ్యాధి సోకిన చిన్నారుల్లో చెప్పిన విషయాలను ఓ పట్టాన అర్థం చేసుకోలేకపోవటం, ఆసక్తి ఉన్న అంశంలో మాత్రమే ప్రతిభ చూపించటం తదితర లక్షణాలు కనిపిస్తాయి. ఇలా ప్రవర్తనా పరమైన ఇబ్బందులను ఎదుర్కొనే చిన్నారులను అశ్రద్ధ చేయకుండా తొలిదశలోనే గుర్తించి తగిన చికిత్సను అందించినట్లయితే మామూలు పిల్లల్లాగే తయారవుతారు.

తెలివితేటలు సక్రమంగా లేనివారిలోనే కాకుండా, బాగా ఉన్న పిల్లలకు సైతం ఈ డిసెక్లిక్సియా వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటివారిలో చదువులో మిగతా పిల్లలకంటే వెనుకబడిపోవటంతో ఒత్తిడి భరించలేక ఆత్మన్యూనతకు గురి కావటమే గాకుండా, అసాధారణ ప్రవర్తనలకు కూడా గురవుతారు.

webdunia
FILE
ముఖ్యంగా తొలిదశలోనే అంటే మూడు సంవత్సరాల లోపుగానే పిల్లల్లో గల ప్రవర్తనాపరమైన లోపాలను గుర్తించి, తగిన చికిత్సను అందించినట్లయితే వారి అమూల్యమైన బాల్యాన్ని కాపాడినట్లవుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి పిల్లలు చదువు నేర్చుకునే విషయంలో మొదటినుంచీ చాలా నిదానంగా ఉంటారు.

వాక్యాలను, పదాలను తప్పుగా పలకటం, పదాలను మధ్యలో తప్పించటం, అక్షరాలను మధ్యలో ఎత్తివేయటం, ప్రత్యామ్నాయ పదాలను మధ్యలో చేర్చటం, పదాలను తిప్పి చదవటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. జబ్బు తీవ్రతను బట్టి, వయస్సును బట్టి ఒక్కొక్కరిలో ఒక్కోవిధంగా ఉంటుంది.

మాటలు నేర్చుకోవటంలో ఆలస్యం, కొత్త పదాలను నేర్చుకునేందుకు అనాసక్తి, నెమ్మదిగా ఉండటం, చేతివాటం, అభివృద్ధి చెందటంలో ఆలస్యం లాంటివి ఉంటాయి. స్కూలుకెళ్లే పిల్లలో అక్షరాలు నేర్చుకోవటం, ఉచ్చరించటంలో ఆలస్యం, వస్తువుల పేర్లు, పదాలను గుర్తు తెచ్చుకోవటంలో ఇబ్బంది, కుడి ఎడమలను ముందు వెనుకలుగా పలకటం, శబ్దాలలో తేడా లేని పదాలను గుర్తించటంలోనూ, పలకటంలోనూ ఇబ్బంది పడటం లాంటివి ఉంటాయి. ముఖ్యంగా చూపు, వినికిడి లోపం లేకున్నా వినటం, చూడటంలో లోపాలుంటాయి.

ఈ డిసెక్లిక్సియా వ్యాధి రావటానికిగల స్పష్టమైన కారణాలు తెలియకున్నప్పటికీ పలు పరిశోధనల్లో తేలిన అంశాలను గమనిస్తే మగపిల్లల్లోనే ఎక్కువగా ఈ లోపం కనిపిస్తున్నట్లు అర్థమవుతోంది. చదవటానికి, రాయటానికి ఉపయోగపడే మెదడులోని సున్నితమైన భాగాలకు దెబ్బ తగిలినప్పుడు లేదా కాన్పు సమయంలో మెదడు ఒత్తిడికి గురైనప్పుడు, ఇన్‌ఫ్లుయెంజ్ లాంటి వ్యాధులకు లోనైనప్పుడు పిల్లల్లో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

పిల్లల్లో ఈ వ్యాధిని గుర్తించటం కొంత కష్టమైన పనే. అయితే ఈ వ్యాధిపట్ల పూర్తి అవగాహన కలిగి ఉన్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కాస్త సులభంగానే గుర్తించవచ్చు. పిల్లల తెలివితేటలను అంచనా వేయటం, పలికే విధానం, రాసే విధానం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే గుర్తించటం సులువే. అలాగే చూపు, వినికిడి లోపాలు లేవనే సంగతిని సైతం నిర్ధారించుకోవాలి.

డిసెక్లిక్సియా వ్యాధి లక్షణాలను పిల్లల్లో గుర్తించిన తల్లిదండ్రులు నిపుణుల సహాయంతో కొన్ని సూచనలు నేర్చుకుని లోపాలను సరిచేసే ప్రయత్నం చేయాలి. పిల్లలపై ఒత్తిడి తేవటం, నిందించటం, ఇతర పిల్లలతో పోల్చి చూడటం లాంటివి అస్సలు చేయకూడదు. సాధ్యమైనంతవరకు వ్యాధిపీడిత చిన్నారులతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు ప్రేమపూర్వకంగా వ్యవహరించినట్లయితేనే వారిని దాన్నుంచి బయటపడవేయగలమనే సంగతిని మాత్రం మర్చిపోకూడదు.

Share this Story:

Follow Webdunia telugu