Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిన్న పిల్లలకు "వ్యాయామం" మంచిదేనా..?!

చిన్న పిల్లలకు
FILE
సాధారణంగా పిల్లలు స్కూలునుంచి రాగానే, ఏదైనా కాస్త టిఫిన్ తినిపించి వెంటనే ట్యూషన్లకు తరిమేస్తుంటారు తల్లిదండ్రులు. స్కూలు, స్కూలు నుంచీ రాగానే ట్యూషన్, ట్యూషన్ నుంచి రాగానే హోంవర్క్, ఆపైన నిద్ర, మళ్లీ పెందలాడే లేవటం, స్కూలుకు పరుగులెత్తటం.. పిల్లల జీవితం ప్రతిరోజూ ఇలాగే గడుస్తుంటుంది. అయితే స్కూలునుంచి ఇంటికి వచ్చిన పిల్లలతో కాసేపు వ్యాయామం చేయించటం మంచిదని వైద్యులు, పిల్లల నిపుణులు సూచిస్తున్నారు.

పిల్లలు పాఠశాలల నుంచి ఇంటికి రాగానే, ప్రెషప్ అయిన తరువాత తల్లిదండ్రులు వారితో కాసేపు వ్యాయామం చేయించటం మంచిదని నిపుణుల సలహా. ఆ తరువాతే వారికి ఎక్కువగా పోషక విలువలు ఉండే ఆహారాన్ని తినిపించి ట్యూషన్లకు పంపించాలని అంటున్నారు. ఇలా చేయటంవల్ల పిల్లలు చదువుల్లో ముందుండటమేగాకుండా.. చురుకుగా ఉంటారని చెబుతున్నారు. వ్యాయామం చేయించటం కుదరనివారు పిల్లలచేత యోగా, మెడిటేషన్ లాంటివి చేయించినా మంచి ఫలితం ఉంటుందంటున్నారు.

పిల్లలతో వ్యాయామం చేయించటంవల్ల అనేక లాభాలున్నాయి. ముఖ్యంగా సాయంత్రంవేళల్లో వ్యాయామం చేయిస్తే.. పిల్లలు శారీరకంగా బలంగా తయారవుతారు. పాఠశాలల్లో ఎక్కువ సమయం కూర్చొనేందుకు సరిపడా శక్తిని, సహనాన్ని పొందుతారు. వీలయితే ఉదయంపూట కూడా వారితో వ్యాయమం చేయించటం మంచిది. దీనివల్ల వారి మెదడు చురుకుగా పనిచేస్తుంది.

చిన్నవయస్సులోనే అధిక బరువు సమస్యతో బాధపడే చిన్నారులచేత ప్రతిరోజూ ఓ గంటసేపు వ్యాయామం చేయిస్తే, బరువు తగ్గటమేగాకుండా.. ఉత్సాహంగా ఉంటారు. పిల్లలకు చదువుపై పూర్తిస్థాయిలో ఏకాగ్రత పెరగాలంటే వ్యాయామం చేయించాలని నిపుణులు చెబుతున్నారు. శక్తికి మించి పుస్తకాల సంచీలను మోస్తున్న చిన్నారులు అలసిపోకుండా ఉండాలన్నా వ్యాయామం తప్పనిసరని అంటున్నారు.

అన్నింటికంటే ముఖ్యంగా పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలన్నా, మెదడు చురుకుగా పనిచేయాలన్నా తప్పనిసరిగా వారితో వాకింగ్, స్కిప్పింగ్ లాంటి వ్యాయామాలను తల్లిదండ్రులు దగ్గరుండి చేయించాలి. అలాగే మలబద్ధకంతో బాధపడే చిన్నారులకు వ్యాయామం చాలా మేలు చేస్తుంది. వ్యాయామం చేయటంవల్ల జీర్ణక్రియ సక్రమంగా జరగటంతోపాటు, వారిలో ఆకలి కూడా పెరుగుతుంది. అయితే అందుకు తగినట్లుగా తల్లిదండ్రులు మంచి పోషకాహారాన్ని పిల్లలకు అందించినట్లయితే ఆరోగ్యవంతులుగా ఉంటారు.

Share this Story:

Follow Webdunia telugu