కేంద్ర రాష్ట్రాల్లో ఏర్పాటైన ప్రభుత్వాలు దివంగత మహానేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి రెక్కల కష్టంతో నిర్మించిన అధికార సౌథాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. కృష్ణా జిల్లాలో సాగుతున్న ఓదార్పు యాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ... మహానేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి రెక్కల కష్టంపై రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే నేతకు వ్యతిరేకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు.
వైఎస్ఆర్ చలవతో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఈ వేళ ఆయన చనిపోయాక, మరణించిన మనిషిపై బురదజల్లే కుట్ర పన్నిందన్నారు. అన్ని విలువలకూ తిలోదకాలిచ్చి చివరకు ప్రతిపక్ష చంద్రబాబుతో చేతులు కలిపి అపవిత్ర కలయికకు నాంది పలికిందన్నారు.
మహానేత మరణించి రెండేళ్లవుతున్నా ఆయన జ్ఞాపకాలను ఇప్పటికీ ప్రజలు హృదయపు లోతుల్లో పదిల పరుచుకుని ఉన్నారన్నారు. వైఎస్ మరణించిన తర్వాత కూడా వైఎస్ ప్రజల హృదయాల్లో ఇంతగా నిలిచిపోవడానికి కారణం ఆయన పేదల కష్టాలను తెలుసుకున్న నేత అని జగన్ గుర్తు చేశారు. ఆ కష్టాలకు పరిష్కారాలను చూపిన నాయకుడు వైఎస్ అని అందుకే ప్రతిరోజూ పేదవాడికి ఏదో ఒక సందర్భంలో ఆయన గుర్తుకొస్తూనే ఉంటారని జగన్ చెప్పుకొచ్చారు.
ఇలాంటి మహానేతపై జరుగుతున్న కుట్రలు చూసినప్పుడు ఎంత బాధ అనిపించినా.. ఇలా మీ ముందుకు వచ్చినప్పుడు మీరు కురిపిస్తున్న ఆదరాభిమానాలు, ఆప్యాయతలు ఆ బాధను మురిపింప చేస్తున్నాయన్నారు. మీ ప్రేమ, ఆప్యాయతలకు ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేనని జగన్ అన్నారు.