వంగవీటి రాధా చేరిక... వల్లభనేని వంశీ కూడా జై జగన్ అంటారా..?!!
, శుక్రవారం, 27 ఏప్రియల్ 2012 (22:51 IST)
ఉప ఎన్నికలకు ముందే కృష్ణా జిల్లాలో అటు కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు దొంగచూపులు చూస్తున్నారు. అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ తూర్పు నియోజకవర్గానికి చెందిన వంగవీటి రాధాకృష్ణ జగన్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. తాజాగా శుక్రవారం మరో ఆసక్తికర సంఘటన జరిగింది. కృష్ణాలో తెదేపాకు కీలక నాయకుడిగా పేరున్న వల్లభనేని వంశీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆ ప్రక్కనే ఉన్న వంగవీటికి కూడా చెప్పేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కృష్ణా జిల్లాలో కలియతిరుగుతున్న జగన్.. జిల్లాలో పట్టున్న నేతలను తన గూటికి రప్పించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో వల్లభనేని వంశీ - జగన్‌ను విష్ చేయడాన్ని చూస్తే ఏదో ఒకరోజు వల్లభనేని కూడా జై జగన్ అంటారేమోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లో ఏదైనా జరుగవచ్చు. చూద్దాం..