మే 28న జగన్‌ను అరెస్టు చేసేందుకేనా మంత్రుల విచారణ..?!!
, శనివారం, 19 మే 2012 (17:19 IST)
మే 28న సీబీఐ కోర్టు ముందు ఆస్తుల కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. దీనికింకా మరో 10 రోజుల వ్యవధి ఉంది. దీంతో విచారణను మరింత వేగవంతం చేసింది. ముఖ్యంగా వైఎస్ హయాంలో ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పద జీవోల వ్యవహారం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యాలేమిటో నిగ్గు తేల్చాలని సీబీఐ తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే జగన్ సంస్థలలోకి వచ్చిన నిధులు, పెట్టుబడులు పెట్టినవారిని వరుసబెట్టి అరెస్టులు చేస్తోంది. ఐఏఎస్ అధికారుల దగ్గర్నుంచి మొదలైన అరెస్టుల పర్వం ఇపుడు మెల్లగా వ్యాపార దిగ్గజాలకు చేరింది. ఐఏఎస్ అధికారులు, కస్టడీలో ఉన్న దిగ్గజం నిమ్మగడ్డ ప్రసాద్ చెప్పిన సమాచారాన్ని ఆధారం చేసుకుని మెల్లిగా తన దృష్టిని రాష్ట్ర మంత్రులవైపు మళ్లించింది. వైఎస్ హయాంలో కీలక శాఖలకు మంత్రులుగా పనిచేసినవారు జగన్ అనుబంధ సంస్థలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారని సీబీఐ అనుమానిస్తోంది. అందువల్లనే ఇప్పటికే పలువురు రాష్ట్రమంత్రుల్ని విచారణ చేసింది. మళ్లీ వారినే గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తోంది. ముఖ్యంగా పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖకు మంత్రిగా చేసిన మోపిదేవి వెంకటరమణ వాన్‌పిక్ ఒప్పందం విషయంలో నిమ్మగడ్డకు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. ఇంకా వైఎస్ హయాంలో రెవిన్యూ మంత్రిగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావును కూడా సీబీఐ విచారించింది.ఇక ప్రస్తుత హోంమంత్రి, గతంలో గనులు, భూగర్భ, చేనేత, జౌళి శాఖ మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి ఇండియా సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్, రఘురామ్ సిమెంట్స్, పెన్నా సిమెంట్స్ కు గనుల కేటాయింపులో ఎవరి ప్రోద్బలం ఉన్నదని గుచ్చిగుచ్చి ప్రశ్నించింది. సబిత కేబినెట్ నిర్ణయాల మేరకే అని చెపుతున్నప్పటికీ, ఇతర సంస్థలు ఎన్ని ఉన్నా.. వీటికి మాత్రమే కట్టబెట్టడం వెనుక కారణం ఏంటన్నది రాబట్టాలని ప్రయత్నించినట్లు సమాచారం. ఐతే సబిత వద్ద నుంచి తమకు కావలసిన సమాచారం రాకపోవడంతో మరోసారి విచారించేందుకు రెడీ అవుతోంది సీబీఐ. ఇక తాజాగా జలయజ్ఞం కాలంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్యను, పరిశ్రమల శాఖామంత్రిగా పనిచేసిన గీతారెడ్డికి కూడా తాఖీదులు అందించేందుకు సీబీఐ సన్నాహాలు చేస్తోంది. ఐతే పొన్నాల మాత్రం తాము జారీ చేసిన జీవోలన్న చట్టబద్ధంగా, ఎటువంటి అక్రమాలకు చోటులేనివిగా ఉన్నాయనీ, సీబీఐకు వివరణ ఇస్తామని చెప్పారు. ఏదేమైనా సీబీఐ వరుసగా మంత్రులను విచారణ చేయడాన్ని చూస్తుంటే మే 28న జగన్ మోహన్ రెడ్డిని సీబీఐ అదుపు తీసుకుంటుందేమోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏం జరుగుతుందో చూడాల్సిందే.