తన తల్లిని, తనను ఎదుర్కొనలేక అధికార ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఆయన కృష్ణా జిల్లా ఓదార్పు యాత్రలో మాట్లాడుతూ ఒక తల్లిని, ఒక బిడ్డను ఎదుర్కోలేక కాంగ్రెస్, తెదేపాలు నీచ రాజకీయాలకు, కుట్రలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.
రాష్ట్రంలో జీనచ్ఛవంలా మారిన కాంగ్రెస్‌ను రెండు సార్లు అధికారంలోకి తెచ్చిన వైఎస్సార్ మరణిస్తే ఆయన మరణాన్ని తట్టులేక వందల మంది చనిపోతే.. వారి కుటుంబాలను పరామర్శిస్తానని ఆయన కుమారుడిగా తాను మాట ఇప్వడం తప్పా అని జగన్ ప్రశ్నించారు.
తాను చేపట్టిన ఓదార్పు యాత్రపై ఆంక్షలు విధించి తనను బయటకు వెళ్లేలా కాంగ్రెస్ అధిష్టానం చేసిందని ఆరోపించారు. అలా పార్టీ నుంచి బయటకు వచ్చిన రెండు నెలలకే ఆదాయం పన్ను శాఖ నోటీసులిచ్చారని, అదీ చాలక కాంగ్రెస్ మంత్రుల చేతనే కోర్టులో కేసులు వేయించి చిత్ర హింసలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అదిచాలదన్నట్టుగా బద్ధశత్రువు లాంటి చంద్రబాబుతో చేతులు కలిపి కోర్టు మెట్లెక్కారని ఆరోపించారు. కేవలం ఒక తల్లిని, ఒక బిడ్డను ఇబ్బందులు పెట్టడానికి కాంగ్రెస్ పెద్దలు, చంద్రబాబు నానా గడ్డి తింటున్నారని దుయ్యబట్టారు.