Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దమ్ముంటే మా ఎమ్మెల్యేలందరిపై అనర్హత వేటు వేయండి: జగన్

Advertiesment
జగన్ మీడియా సమావేశం
, మంగళవారం, 6 డిశెంబరు 2011 (13:42 IST)
FILE
నీచమైన రాజకీయాలకు పాల్పడకుండా, దమ్మూ ధైర్యం ఉంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన తన వర్గం మ్మెల్యేలందరిపైనా మూకుమ్మడిగా అనర్హత వేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ సవాల్ విసిరారు. దశలవారీగా ఏ ఇద్దరిపైనో, ముగ్గురిపైనో అనర్హత వేటు వేయకుండా మూకుమ్మడిగా అందరిపై వేస్తే తమ సత్తా ఏంటో కాంగ్రెస్ పార్టీ ఒకేసారి చూడవచ్చని అన్నారు.

ఇప్పటివరకూ ప్రాంతీయ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయని జగన్ తొలిసారిగా తన వర్గం ఎమ్మెల్యేలు త్యాగం చేశారని చెప్పేందుకే వచ్చానని అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ ఆయన... నిన్న రాత్రి జరిగిన అవిశ్వాస తీర్మానం దేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక ఘటనగా అభివర్ణించారు.

కారణం ఏంటంటే.. ఒక అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు నైతికత, విశ్వసనీయతకు అర్థం చెపుతూ, రైతులు పడుతున్న అవస్థలు, రైతు కూలీల బాధలు చూసి తమ ఎమ్మెల్యే పదవులు పోతాయని తెలిసి కూడా ప్రజల తరపున నిలబడ్డారని కొనియాడారు. వారందరికీ తాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పుకొచ్చారు.

ఇక ప్రభుత్వంపై చంద్రబాబు పెట్టిన అవిశ్వాసం పేద రైతులకోసం కాదనీ, ప్రభుత్వానికి బాసటగా నిలిచేందుకేనని ఆరోపించారు. అవిశ్వాస తీర్మానంలో రైతులు గురించి మాట్లాడని బాబు ఆ దివంగత నేత గురించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ తనవైపు ఉన్న ఎమ్మెల్యేలను దారి మళ్లించాలన్న కుటిల యత్నం చేశారన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు రెండూ కుళ్లు, కుతంత్రాలతో కూడిన రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు.

తనకు మద్దతు పలికిన వారిపై అసెంబ్లీ వేదిక సాక్షిగా కాంగ్రెస్ పార్టీ బెదిరింపులు, ప్రలోభాలకు పాల్పడిందని దుయ్యబట్టారు. అసలు గ్రామాల్లో రైతులు పడుతున్న అవస్థలు అటు తెలుగుదేశం ఇటు కాంగ్రెస్ పార్టీలకు తెలుసా..? అని ప్రశ్నించారు. ఈవేళ రైతులు పండించిన పంటకు గిట్టుబాట ధర లేక విలవిలలాడుతున్నారని అన్నారు. వీరి గోడు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు పట్టడం లేదనీ, దొందూదొందేనని విమర్శించారు.

Share this Story:

Follow Webdunia telugu