Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్‌ను "0" చేయడమే సీఎం కిరణ్ కుమార్ లక్ష్యమా..?!!

Advertiesment
జగన్
, శుక్రవారం, 30 డిశెంబరు 2011 (13:36 IST)
WD
వచ్చే ఎన్నికల నాటికి జగన్‌ను "0" చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పథకాల పరిచయం జరుగుతోంది. సీఎం వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలపైనే ఎందుకంత గురిపెట్టారని చూస్తే ఓ విషయం బోధపడుతుంది. జగన్ కొత్త పార్టీ స్థాపన కేవలం తన తండ్రి వైఎస్సార్ పథకాల నేపధ్యంగానే జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను చూస్తే ఈ విషయం అవగతమవుతుంది.

జలయజ్ఞం, ఉచిత విద్యుత్, పావలా వడ్డీకే రుణాలు, ఆరోగ్యశ్రీ.. ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలన్నీ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినవి కావనీ, కేవలం వైఎస్సార్ మాత్రమే స్వయంగా ప్రవేశపెట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వస్తోంది.

వైఎస్సార్ హఠాన్మరణం తర్వాత గద్దెనెక్కిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల నేతృత్వంలోని సర్కార్ తన తండ్రి ప్రవేశపెట్టిన పథకాలను అమలుపరచడంలో ఘోరంగా విఫలమయ్యాయనీ జగన్ ఎప్పట్నుంచో తూర్పారబడుతూ వస్తున్నారు. ఐతే రోశయ్య ముఖ్యమంత్రి పదవిని వదిలి, కిరణ్ కుమార్ రెడ్డి ఆ పదవిని చేపట్టాక మెల్లగా జగన్ గ్రూపుపై టార్గెట్ పెట్టారు.

వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ కాంగ్రెస్ పథకాలే తప్ప ఆయన సొంత పథకాలు కావని సీఎం కిరణ్ చెప్పడం మొదలెట్టారు. అంతేకాదు.. వైఎస్సార్ పథకాలకు ధీటుగా ఆ స్థానంలో కొత్త పథకాలను పరిచయం చేస్తున్నారు.

మహిళలకు పావలా వడ్డీకే రుణాలను.. ఇపుడు వడ్డీలేని రుణాలుగా మార్చేశారు. తెల్ల రేషన్ కార్డుదారులకే ఆరోగ్యశ్రీ అని వైఎస్సార్ అంటే.. అందరికీ ఆరోగ్యశ్రీ అని కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఇక రాజీవ్ యువకిరణాలు, ఇందిర జలప్రభ, రూపాయికే కిలో బియ్యం వంటి పథకాలతో ప్రజలు వైఎస్సార్ పథకాలు మర్చిపోయేట్లు చేస్తున్నారు.

అదేసమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇక కొత్తగా చెప్పుకునేందుకు కూడా ఎటువంటి పథకాలను లేకుండా చేస్తున్నారు. మొత్తంగా వచ్చే 2014 నాటికి పూర్తిస్థాయిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడులను ఎదుర్కొని పార్టీని తిరిగి గెలిపించేందుకు తీవ్ర యత్నం చేస్తున్నట్లే కనబడుతోంది. కిరణ్ అనుకున్నట్లుగా జనం కాంగ్రెస్ పార్టీకే తిరిగి పట్టం కడతారో లేదంటే జగన్‌కు జై అంటారో వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu