జగన్ అరెస్టు వద్దేవద్దు.. దారికి తెచ్చుకుందాం : కాంగ్రెస్ నేతలు!!
, శుక్రవారం, 9 మార్చి 2012 (19:00 IST)
ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి "ముందు నుయ్యి.. వెనుక గొయ్యి" అన్న చందంగా ఉంది. ఇపుడున్న పరిస్థితుల దృష్ట్యా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తే మరింతగా నష్టపోతామని కాంగ్రెస్ అధిష్టానంతోపాటు రాష్ట్రానికి చెందిన పలువురు సీనియర్ నేతలు వాపోతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం రాష్ట్రంలో చాలా తీవ్రంగా ఉందని, ఇది ఈ నెల 18వ తేదీన, ఆ తర్వాత జరిగే 17 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాలపై కూడా ప్రభావం చూపుతుందన్న భావనను వారు వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ నెల ఆరో తేదీన వెల్లడైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ చావుదెబ్బ తిన్న విషయం తెల్సిందే. రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోగా.. భాజపా పాలిత ప్రాంతమైన ఉత్తరాఖండ్‌లో బొటాబొటి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక యూపీలో పార్టీ పరిస్థితి కొత్తగా చెప్పనక్కర్లేదు. రాహుల్, ప్రియాంక, సోనియా, మన్మోహన్ ఇలా ఎందరో ఉద్ధండులు ప్రచార బరిలోకి దిగినా.. అభ్యర్థులను గెలిపించుకోవడంలో అర్థ సెంచరీ మార్కును కూడా దాటలేక పోయారు. ఇదే పరిస్థితి పునరావృతమైతే.. వచ్చే 2014లో ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోవడం ఖాయమనే ఊహాగానాలు ఇప్పటి నుంచే జోరుగా సాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు పట్టుగొమ్మలాంటి ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని చేజేతులా నాశనం చేసుకునేందుకు కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధంగా లేదు. అందుకే.. వైఎస్ఆర్‌సి అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి అరెస్టు వ్యవహారంలో ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తున్నట్టు సమాచారం. జగన్ విషయంలో అధిష్టానం తన వైఖరి మార్చుకునే అవకాశాలున్నాయంటూ మరికొందరు సీనియర్లు వ్యాఖ్యానిస్తుండటమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వైఎస్సార్ మరణం, ఆయన కుమారుడు జగన్ పార్టీని వీడి వెళ్ళడంతో పార్టీకి ప్రజాకర్షక నాయకుడు కరువయ్యారు. అన్ని రకాల మార్గాల్లో జగన్‌ను అణగదొక్కినట్లయితే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బలం పుంజుకోవచ్చని అధిష్టానం తొలుత భావించింది. రాజకీయంగా జగన్ వ్యవహారంలో కఠినంగా వ్యవహరించడంతో పాటు అక్రమ ఆస్తుల వ్యవహారంలో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నందున అధికారపరంగా కూడా అదే వైఖరిని అనుసరించాలని అనుకుంది. ఈ మేరకు జగన్‌ను సీబీఐ త్వరలోనే అరెస్టు చేయవచ్చన్న సంకేతాలు కూడా వెలువడ్డాయి. అయితే, ఇక్కడే కాంగ్రెస్ వ్యూహం బెడిసికొట్టింది. జగన్‌పై ప్రయోగించిన బాణాలు గురితప్పాయి. ఫలితంగా కాంగ్రెస్ పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. ఇలాంటి సమయంలో జగన్‌ను అరెస్టు చేసినట్లయితే ఆయన పట్ల ప్రజల్లో మరింత సానుభూతి పెరిగే అవకాశం ఉందని, దీనివల్ల కాంగ్రెస్ మరింత నష్టపోయే అవకాశం ఉందన్న ఆందోళన రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. అయితే... కొందరు నేతలు మాత్రం జగన్‌ను అరెస్టు చేసేందుకు ఇదే మంచి తరుణమని, ఇలా చేస్తే వైఎస్ఆర్‌సి పార్టీ నాయకుల్లో ఆత్మస్థైర్యం దెబ్బ తింటుందని, పార్టీ నిర్వీర్యమవుతుందని వారు వాదిస్తున్నారు. కానీ, మెజారిటీ నేతలు మాత్రం ఈ వాదనతో ఏకీభవించడం లేదు. అందుకే జగన్ విషయంలో మెతక వైఖరి అవలంభించి.. 2014 నాటికి తమ దారికి తెచ్చుకునేందుకు కాంగ్రెస్ సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించాలని భావిస్తున్నట్టు సమాచారం.