వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన హస్తిన పర్యటన విఫలమైందనే చెప్పొచ్చు. తనకు వ్యతిరేకంగా యూపీఏ ప్రభుత్వం సీబీఐ అనే అస్త్రంతో కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని, తనకు అండగా నిలవాలని కోరుతూ ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో కాంగ్రేసేతర పక్షాల మద్దతును కూడగట్టాలని వెళ్లారు.
ఇందులోభాగంగా ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ, లెఫ్ట్ పార్టీల నేతలు, ఆర్జేడీ, ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీల అధినేతలతో పాటు.. ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌తోనూ భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. కానీ, జగన్ ఢిల్లీ పర్యటన ఆయన అనుకున్నట్టుగా సాగలేదు. ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ ఛైర్మన్ ఫరూక్ అబ్దుల్లా, శరద్ పవార్ (ఎన్సీపీ), లాలూ ప్రసాద్ యాదవ్ (లాలూ) వంటి అతికొద్ది మంది నేతలను మాత్రమే కలుసుకోగలిగారే కానీ.. భారతీయ జనతా పార్టీ, లెఫ్ట్ పార్టీల నేతలు కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు.
భాజపా మహిళా నేత సుష్మా స్వరాజ్ బిజీ షెడ్యూల్ వల్ల సమయం కేటాయించలేనని తెగేసి చెప్పారు. ఇకపోతే.. లెఫ్ట్ పార్టీల నేతలు.. జగన్‌తో చేతులు కలిపేందుకు ససేమిరా అన్నారు. జగన్ తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్‌ను అవినీతి రాజాగా అభివర్ణించామని అందువల్ల ఇపుడు జగన్‌తో చేతులు కలపడం అసాధ్యమని వారు తెగేసి చెప్పారు. జగన్‌పై అవినీతి ఆరోపణలు వచ్చాయి కాబట్టే తాము ఆయనను కలుసుకోలేమంటున్నారు.
జగన్‌కు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేశామని కూడా వారు చెప్పారు. ఇదిలావుంటే భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపే ప్రసక్తే లేదంటూ జగన్ ఢిల్లీకి వచ్చినప్పటి నుంచి అంటే గత నాలుగు రోజుల నుంచి పలు ప్రకటనలు చేయటం పట్ల ఆ పార్టీ సీనియర్ నాయకులు మండిపడ్డారు.
తనపై జరిగిన సీబీఐ దాడులను లోక్‌సభలో ఖండించిన ప్రతిపక్షం నాయకురాలు సుష్మాస్వరాజ్‌ను కలుసుకుని కృతజ్ఞతలు తెలియజేస్తానని, అయితే భాజపాతో కలిసి పని చేసే ప్రసక్తే లేదని జగన్ తన ఢిల్లీ పర్యటన తొలిరోజే ప్రకటన చేయడం కమలనాథులను బాధపెట్టినట్టుగా ఉంది. అందుకే జగన్‌ను కలుసుకునేందుకు సుష్మా స్వరాజ్ ఆసక్తి చూపలేదు. బిజీ షెడ్యూల్ సాకు చూపి అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. తమ పార్టీ అవసరం లేదు కానీ సుష్మాస్వరాజ్ ఆశీస్సులు కావాలంటే ఎలా అని కమలనాథులు ప్రశ్నించారు.
అంతేకాకుండా, 2014 లోక్‌సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైతే యూపీఏకు మద్దతు ఇస్తామని, ప్రజాసంక్షేమం, రాష్ట్రాభివృద్ధి దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్‌తో సైతం చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు జగన్ చేసిన ప్రకటన కూడా భాజపా నేతలను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. మొత్తం మీద జగన్ హస్తిన పర్యటన పేలవంగా నిష్ప్రయోజనంగా సాగిందనే చెప్పక తప్పదు.