జగన్ వర్గం ఎమ్మెల్యేల భేటీ: జారిపోయిన ఆరుగురు ఎమ్మెల్యేలు
, గురువారం, 24 నవంబరు 2011 (13:16 IST)
జగన్ వర్గం ఎమ్మెల్యేలు జారిపోతున్నారనే కథనాలు ప్రముఖ పత్రికల్లో జోరందుకోవడంతో గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన వర్గ ఎమ్మెల్యేలతో సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి ఆరుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. జగన్ వర్గం ఎమ్మెల్యేలు భేటీ కాక మునుపే ఎమ్మెల్యే శేషారెడ్డి కాంగ్రెస్ పార్టీ వెంటే కొనసాగుతానని మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవినీతి రహిత పాలనను అందిస్తున్నారనీ, ఆయన యువతకు, రైతులకోసం నిర్వహిస్తున్న పథకాలు తనను ఆకట్టుకున్నాయన్నారు. ప్రజలు, కార్యకర్తల అభీష్టం మేరకు తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కాగా ఇటీవలే సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ కూడా కిరణ్ కుమార్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు. తనకు నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యమని ప్రకటించారు. మొత్తమ్మీద జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఇంతకు ముందున్న ఊపు ప్రస్తుతం లేదనే వాదనలు బలంగా వినబడుతున్నాయి. జగన్ నివాసంలో ఏర్పాటైనా సమావేశానికి ఆళ్ల నాని, జయసుధ, భారతి, కుంజా సత్యవతి, శేషారెడ్డి, శ్రీనివాసులు గైర్జాజరయ్యారు. కాగా సత్యవతి, భారతి సాయంత్రం వచ్చి జగన్‌తో భేటీ అవుతామని చెప్పినట్లు సమాచారం.