వైఎస్.జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు ఒకభయం పట్టుకుంది. తమ రాజీనామా పత్రాలపై సభాపతి నాదెండ్ల మనోహర్ ఎక్కడ ఆమోదముద్ర వేస్తారేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. దీంతో చాలా మంది జగన్ వర్గ ఎమ్మెల్యేలలో వణికిపోతున్నారు. వారు రాజీనామా చేసినప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నేడు లేకపోవడమే అని వారు బలంగా విశ్వసిస్తున్నారట.
జగన్ ఆస్తులపై సీబీఐ దర్యాప్తు నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటన సందర్భంలో ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీకే మద్దతు ప్రకటిస్తానన్నట్లు మాట్లాడటం ఆ వర్గాన్ని విస్మయానికి గురి చేసింది. జగన్‌తో జట్టు కట్టినప్పటికీ చివరకు మళ్లీ కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడటం అనేది వారికి ఏమాత్రం రుచించడం లేదు. దీన్ని పెక్కు మంది ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేక పోతున్నారు.
దీంతో ఎందుకొచ్చిన గోల... కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే పోతుందన్న అభిప్రాయానికి సింహభాగం ఎమ్మెల్యేలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా.. ఇప్పటికే జయసుధ, గురునాథ రెడ్డి వంటి వారు రాజీనామాలు చేసినప్పటికీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోనే ఉండేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ స్థాపించినప్పటి ఊపు నేడు లేదన్న వాదనలు మరింత బలం పుంజుకుంటున్నాయి. ఈ పరిస్థితిని జగన్ ఎలా నెగ్గుకొస్తారో చూడాలి.