జగన్ పార్టీని చూసి కేసీఆర్ వణుకుతున్నారా..?!!
, సోమవారం, 19 నవంబరు 2012 (20:05 IST)
జగన్ మోహన్ రెడ్డి పార్టీ వైకాపా అటు చంద్రబాబు నాయుడికి ఇటు కేసీఆర్‌కు ముచ్చెమటలు పట్టిస్తోందా..?! అందుకే ఆ నాయకులిద్దరూ ఒకేమారు జగన్ పార్టీపై టార్గెట్ పెట్టారా..?!! అనే ప్రశ్నలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.ముఖ్యంగా తెరాస చీఫ్ కేసీఆర్ మున్నెన్నడూ జగన్ పార్టీని విమర్శించని విధంగా తూర్పారబడుతున్నారు. జగన్ పార్టీ గెలిస్తే రాజన్న రాజ్యం కాదు రాక్షస రాజ్యం వస్తుందని ధ్వజమెత్తుతున్నారు. తెలంగాణను అడ్డుకున్న దుర్మార్గుడు వైఎస్సార్ అంటూ విమర్శిస్తున్నారు. అలాంటి తండ్రి కుమారుడు జగన్ పార్టీ రాజ్యం మనకు కావాలా అంటూ ప్రశ్నిస్తున్నారు కేసీఆర్. ఐతే కేసీఆర్ ఉన్నట్లుండి ఇలా కలవరపడటానికి కారణం... తెలంగాణలో వైకాపా క్రమంగా బలం పుంజుకోవడమేనట. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతం నుంచి ఆయా పార్టీల నుంచి హీనపక్షంగా ఓ 20 మంది ఎమ్మెల్యేలు జగన్ పార్టీలోకి జంప్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఒకవేళ వైఎస్సార్ పార్టీ తెలంగాణ బలపడితే, తెలంగాణ సెంటిమెంట్ తన చేతుల్లోను జారిపోతుందన్న భయంలో కేసీఆర్ ఉన్నట్లు చెపుతున్నారు. చూడాలి ఏం జరుగుతుందో..?!!