Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్ ఢిల్లీలో మోకరిల్లాడా..? : అందుకే సీబీఐ దర్యాప్తు వేగం తగ్గిందా!?

Advertiesment
జగన్
, సోమవారం, 19 సెప్టెంబరు 2011 (17:11 IST)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ జగన్ ఇటీవల చేపట్టిన హస్తిన టూర్ ఆశించిన ఫలితాన్నే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ పర్యటన అనంతరం జగన్ అక్రమాస్తులు, కంపెనీల్లో పెట్టుబడులపై కేంద్ర నేరపరిశోధనా సంస్థ (సీబీఐ) చేపట్టిన దర్యాప్తులో వేగం తగ్గిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఈ ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో పాటు కేంద్ర మంత్రి శరద్ పవార్‌తో జగన్ భేటీ అయ్యారు. కాంగ్రెస్‌తో విభేదించిన తర్వాత జగన్‌కు అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు నిరాకరించిన మన్మోహన్.. ఈ దఫా మాత్రం జగన్‌ను కలుసుకున్నారు.

ప్రధానితో భేటీ తర్వాత జగన్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల సంక్షేమం దృష్ట్యా అవసరమైతే యూపీఏ లేదా కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆ ప్రకటన ద్వారా వెల్లడించారు.

అప్పటి నుంచి ఆయన వ్యవహారశైలి కూడా మారింది. కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకున్న జగన్ మీడియా.. ఒక్కసారి భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేయసాగింది. అదేసమయంలో జగన్ ఆస్తులపై సీబీఐ దర్యాప్తు వేగం కూడా బాగా మందగించిందని చెప్పొచ్చు.

తాను కేసుల నుంచి బయటపడుతానని వైఎస్ జగన్ తాజాగా ఆదివారం కృష్ణా జిల్లా ఓదార్పు యాత్రలోనూ అన్నారు. దీన్నిబట్టి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, జగన్‌కు మధ్య రహస్య అవగాహనా ఒప్పందం కుదిరందని ప్రధాన ప్రతిపక్షం తెదేపా ఆరోపిస్తోంది.

జగన్ ఢిల్లీ యాత్రకు ముందు ఆయన ఆస్తులు, అక్రమాల విషయమై సీబీఐ విచారణ శరవేగంగా సాగిందని, జగన్ ఢిల్లీ యాత్ర తర్వాత నెమ్మదించిందని తెదేపా నేతలతో పాటు.. జగన్‌ వ్యతిరేకులైన కాంగ్రెస్ నేతలూ వ్యాఖ్యానిస్తున్నారు. పైపెచ్చు.. ఢిల్లీ నుంచి వచ్చాక జగన్ స్వరంలో కూడా మార్పు వచ్చిందని వారు అంటున్నారు. మొత్తం మీద జగన్ హస్తిన టూర్ ఆయన ఆశించిన ఫలితాన్నే ఇచ్చిందని చెప్పొచ్చు.

Share this Story:

Follow Webdunia telugu