Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్ ఢిల్లీ టూర్: కాంగ్రెస్ పార్టీతో కలవక తప్పదా..?!!

Advertiesment
జగన్
, మంగళవారం, 6 సెప్టెంబరు 2011 (21:50 IST)
WD
జగన్ ఢిల్లీ పర్యటన ఈ విషయాన్నే సూచిస్తున్నట్లు కనబడుతోంది. ఢిల్లీ యాత్రలో కాంగ్రెస్ పార్టీని కడిగేద్దామని బయలుదేరి వెళ్లిన జగన్ మోహన్ రెడ్డికి ఆశించిన ఫలితం కనబడలేదు. అసలు ఢిల్లీ యాత్రలో ఆయన సమావేశమైన నాయకులు ఎంతవరకూ కాంగ్రెస్ పార్టీని నిలదీయగల సమర్థులన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

భాజపాతో ఎన్నికల ముందు కానీ, ఎన్నికల తర్వాత కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోనని కుండబద్ధలు కొట్టిన జగన్, మరి ఎవరితో పొత్తు పెట్టుకోగలరు..? అనే ప్రశ్న ఇపుడు ఉత్పన్నమవుతోంది. రాష్ట్రస్థాయిలో అటు అధికార కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రధానప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలను గడగడలాడిస్తున్న జగన్ ఢిల్లీస్థాయిలో మాత్రం బేలగా మిగిలిపోయారనే వాదనలు బలంగా వినబడుతున్నాయి.

అసలు జగన్ ఎంచుకున్న టైం సరైంది కాదని అంటున్నారు. ఎందుకంటే ఆయన అలా ఢిల్లీకి వెళ్లారో లేదో ఇక్కడ మైనింగ్ డాన్ గాలి జనార్థన్ రెడ్డిపై సీబీఐ విరుచుక పడింది. అత్యంత అధునాతన టెక్నాలజీ సాయంతో గాలి అక్రమాలకు పాల్పడ్డారని నిర్థారించిన సీబీఐ కటకటాల వెనక్కి నెట్టింది.

ఈ సమయంలో ఢిల్లీ నాయకుల తలుపు తట్టిన జగన్‌కు వారి నుంచి అనుకున్నంత స్థాయిలో స్పందన రాలేదు. ఫరూక్ అబ్దుల్లా జగన్ చెప్పినదంతా విని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మచ్చలేని నాయకుడని వెనకేసుకొచ్చారు. ఇక ములాయం సింగ్ యాదవ్ నాలుగ్గోడల మధ్య జగన్ మాటలను ఆలకించి, అనంతరం ఒక్క ముక్క కూడా గట్టిగా చెప్పనే లేదు. దీంతో ఇపుడు జగన్‌కు ఢిల్లీలో సీన్ లేదన్న వాదనలు వినబడుతున్నాయి.

రాజకీయంగా ఢిల్లీ స్థాయిలో జగన్ వేస్తున్న స్టెప్పు సరైనదేనా అనే సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి. పైగా రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని ఉతికి ఆరేస్తున్న జగన్, జాతీయ స్థాయిలో మాత్రం తన స్వరాన్ని మార్చారు. భారతీయ జనతా పార్టీతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అంటే ప్రత్యామ్నాయ యూపీఎతో కలిసి వెళ్లనున్నారా..? అంటే అదే నిజమని అనుకునే పరిస్థితి కనబడుతోంది.

ఒకవైపు సీబీఐ, ఇంకోవైపు భాజపాకు జగన్ దగ్గరవుతున్నారన్న గొడవ మధ్య వైఎస్ జగన్ కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సమస్యల నుంచి గట్టెక్కేందుకే ఇలా ఢిల్లీ యాత్ర చేపట్టినట్లు చెపుతున్నారు. అయితే ఆయన ఎంచుకుని వెళుతున్న మార్గం సరైనదేనా..? దీనివల్ల ఆయనకు రాజకీయంగా కలిసి వచ్చేది ఎంత..? కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడం అంత తేలిక్కాదని తెలుసుకున్నారా...? అసలు జగన్ చివరికి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకపోయినా... ఓ మమతా బెనర్జీలా... ఓ శరద్ పవార్ లా ఆ పార్టీకి మిత్రుడైపోతారా...? లెటజ్ వెయిట్ అండ్ సీ.

Share this Story:

Follow Webdunia telugu