జగన్.. కడప పౌరుషం.. ఆత్మగౌరవం ఏమైంది?: తెదేపా
, బుధవారం, 7 సెప్టెంబరు 2011 (19:00 IST)
జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ కాలు దువ్వుతోంది. ఢిల్లీలో జగన్ పర్యటనను, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపడుతూ జగన్‌ను ఏకి పారేసే పనిలో నిమగ్నమైపోయింది. రాష్ట్రంలోనేమో కాంగ్రెస్ పార్టీని మట్టికరిపిస్తామనీ, భూస్థాపితం చేస్తామని సవాళ్లు విసురుతూ ఢిల్లీకి వెళ్లి ఇంగ్లీషులు అదే పార్టీని శ్లాఘిస్తున్నారని విమర్శిస్తోంది. జగన్ భాజపాయేతర ప్రభుత్వానికి మద్దతిస్తానని చెప్పడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి తలొగ్గుతూ రాజీ సంకేతాలు పంపిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. మాటకు ముందు ఆత్మగౌరవం, కడప పౌరుషం అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పే జగన్ ఇపుడు వాటన్నిటినీ ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శించారు.