జగన్ ఆస్తులు జప్తు చేసేందుకు రంగం సిద్ధమవుతోందా..?!!
, గురువారం, 1 సెప్టెంబరు 2011 (19:23 IST)
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జగన్ ఆస్తులపై కేసు నమోదు చేసి జగన్ ప్రధాన నిందితునిగా పేర్కొనడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒకింత ఆందోళనగా ఉన్నట్లు సమాచారం. ఒకవైపు సీబీఐ జగన్ ఆస్తులపై, ఆయనకు చెందిన కంపెనీలపై విరామం లేకుండా దర్యాప్తు చేస్తూనే ఉన్నది. అయితే సీబీఐ దర్యాప్తులో జగన్‌ను అంత ఇరుకున పెట్టగల ఆధారాలు దొరకలేదన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. దీని ద్వారా జగన్‌ను ఇబ్బంది పెట్టవచ్చన్న అభిప్రాయంలో కేంద్రం ఉన్నదన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈడీ కేసుతో జగన్‌కు చెందిన కంపెనీల ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో జగన్ తన వర్గంతో సమావేశమయ్యారు. కేసులు, దర్యాప్తులు గురించి తనకు ఎటువంటి భయం లేదనీ, అయితే వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఎవ్వరూ ఎటువంటి గందరగోళానికి గురికావద్దని జగన్ సూచించినట్లు సమాచారం. మనం అలా చూస్తూ ఉంటే చాలనీ.. ప్రభుత్వం దానంతట అదే పడిపోయే పరిస్థితి ఇక ఎంతో దూరంలో లేదని జగన్ తన వర్గానికి సూచించినట్లు సమాచారం.