Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్ అరెస్టయితే ఆయన వర్గం కాంగ్రెస్‌లోకి జారుకుంటుందా..?!!

Advertiesment
జగన్
, శనివారం, 19 నవంబరు 2011 (13:12 IST)
WD
ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీలోకి దూకుడుగా వెళ్లిపోయిన 26 మందిలో సింహభాగం ఇపుడు తమ రాజీనామాలను ఆమోదించవద్దు మొర్రో అని మొరపెట్టుకుంటున్నారట. దీనికి ప్రధానమైన కారణం... ఒకవేళ జగన్‌పై సీబీఐ చేస్తున్న ఏదేని కేసుల్లో ఆయనను అరెస్ట్ చేస్తే ఇక తమ భవితవ్యం అగమ్యగోచరం అవుతుందని వారు మధనపడుతున్నట్లు సమాచారం. అందువల్లనే స్పీకర్ నాదెండ్లను కలిసిన ప్రతివారూ కారణాలు ఏం చెప్పినప్పటికీ రాజీనామాలు మాత్రం ఆమోదం పొందకుండా చూసుకుంటున్నారు.

జగన్ ఆస్తులకు సంబంధించి సీబీఐ వైఎస్సార్ పేరును ఉటంకించిందని కినుక వహించిన జగన్ వర్గం ఎమ్మెల్యేలు 26మంది మూకుమ్మడిగా తమ రాజీనామా లేఖలను స్పీకర్‌కు అందించారు. తీరా వాటిని ఆమోదించడానికి స్పీకర్ కంకణం కట్టుకునేసరికి వారు బెంబేలెత్తిపోతున్నారట. స్పీకర్ కార్యాలయం నుంచి ఫోన్లు వస్తే దడదడలాడిపోతున్నారట.

ఈ టెన్షన్ భరించలేని కొందరైతే నేరుగా స్పీకర్‌ను కలిసి తమ మనసులో మాట చెప్పేసి రాజీనామాలను ఆమోదించవద్దని విన్నవించుకుంటున్నారట. మొత్తమ్మీద వైఎస్సార్‌పై అభిమానం ఉందంటూ... పదవులను తాము తృణప్రాయంగా భావిస్తామని చెప్పిన ఎమ్మెల్యేలు ఇపుడు గప్‌చిప్ అయ్యారు. మీడియా కంటపడితే ఎటువంటి సమాధానం చెప్పాల్సి వస్తుందోనని పెద్దగా బయటకి కూడా రావడం లేదు.

ఒకవైపు జగన్‌తో ఉంటామని చెపుతూనే ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలకు సన్నిహితంగా ఉంటున్నారు. అదేమని అడిగితే మాత్రం.. తమ నియోజకవర్గ ప్రజల పనులకోసం ప్రభుత్వంతో సఖ్యతగా ఉండక తప్పదని సమాధానమిస్తున్నారు. వీరి డబుల్ గేమ్‌ను చూసిన తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన కొందరు, జగన్ వర్గం ఎమ్మెల్యేలకు నైతిక విలువలు లేవని మండిపడుతున్నారు. ఇప్పటికైనా పార్టీకి క్షమాపణ చెప్పి తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చేయాలని పిలుపునిస్తున్నారు.

ఇకపోతే అసలు జగన్ అరెస్టు వల్ల కాంగ్రెస్‌కు లాభం జరుగుతుందా నష్టం వాటిల్లుతుందా అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ సంగతి ఎలా ఉన్నప్పటికీ ఒకవేళ జగన్ అరెస్టయితే ఆయన ఇమేజీ బాగా దెబ్బ తింటుందని కాంగ్రెస్ పార్టీ ఖుషీగా ఉంది. మొత్తమ్మీద జగన్‌ను అక్రమ ఆస్తుల కేసుకంటే ముందే గాలి జనార్థన్ రెడ్డి అక్రమ గనుల తవ్వకాల కేసులో అరెస్టు చేయడం ఖాయమని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే చెపుతున్నారు. ఇటువంటి పరిస్థితి వస్తుందన్న ఉద్దేశ్యంతోనే జగన్ వర్గానికి చెందిన ఆ 26 ఎమ్మెల్యేలు రాజీనామా లేఖలతో దాగుడుమూతలు ఆడుతున్నారని చెపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu