గుంటూరు జిల్లా ఓదార్పులో జగన్‌పై కోడిగుడ్లు, గులకరాళ్లు
, మంగళవారం, 7 ఫిబ్రవరి 2012 (18:40 IST)
గుంటూరు జిల్లా నర్సరావు పేట మండలం నకిరేకల్‌లో జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్రలో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. జగన్ పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లు, గులకరాళ్లు విసిరారు. జగన్ వాటి నుంచి తృటిలో తప్పించుకున్నారు. కోడిగుడ్లు విసిరిన దుండగులను ఆ తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సందర్భంలో పెద్ద ఎత్తున తోపులాట జరగడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. వారం రోజుల తర్వాత గుంటూరు జిల్లాలో జగన్ తిరిగి తన ఓదార్పు యాత్రను ప్రారంభించారు. యాత్ర నకిరేకల్‌లో చేయనుండటంతో పట్టణంలో కొంతమంది జగన్ ఫ్లెక్సీలను కట్టారు. ఈ విషయంలో కాపు సామాజిక వర్గంతో మరొక వర్గం గొడవ పడింది. ఆ మరుసటి రోజు కుంకులగుంటలో ఉన్న వంగవీటి మోహన రంగా విగ్రహంపైకి చెప్పు విసిరిన సంఘటన చోటుచేసుకుంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగిందనుకున్నప్పటికీ జగన్ యాత్రలో మరోసారి రాళ్ల దాడితో బయటపడింది.