కుడితిలో పడ్డ ఎలకల్లా జగన్ వర్గం ఎమ్మెల్యేలు గిజగిజ
, సోమవారం, 30 జనవరి 2012 (20:44 IST)
జగన్ వర్గం ఎమ్మెల్యేల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకల్లా మారిందంటున్నారు. జగన్ ఆస్తులకు సంబంధించి సీబీఐ వేసిన ఛార్జిషీటులో వైఎస్సార్ పేరు ఉన్నదంటూ తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేల్లో 16 మంది అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు.ఈ నేపథ్యంలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆ 16 మంది ఎమ్మెల్యేల వివరణ కోసం నోటీసులు పంపారు. అయితే స్పీకర్ పిలిచినా వెళ్లవద్దంటూ వైఎస్సార్ కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్యేలకు హుకుం జారీ చేసిందట. ఈ వ్యవహారం ఇప్పుడు ఆ 16 మంది ఎమ్మెల్యేల్లో కొంతమందికి అసహనాన్ని కలిగిస్తోందట. పిలిస్తే వెళితే ఏమవుతుందని వారిలో వారు గొణుక్కుంటున్నారట. అధికార పార్టీ కాంగ్రెస్‌ను కాదని జగన్‌కు జై కొట్టడంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎక్కడివక్కడే చతికిలపడ్డాయట. దీంతో సదరు ఎమ్మెల్యేలు కనబడితే చాలు... జనం వారిపై సమస్యలతో దండయాత్ర చేస్తున్నారట. జనం దండయాత్రతో నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితి ఏర్పడిందట. కనీసం కాంగ్రెస్ పార్టీ అయినా తమను అనర్హులుగా ప్రకటిస్తే జనంలోకి వెళ్దామంటే సాగదీస్తుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారట. ఇంకోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది జగన్‌ను రాంగ్ ట్రాక్ లోకి తీసుకెళుతున్నారనీ, దీంతో తమ పరిస్థితి గందరగోళంలో పడిపోతోందని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారట.స్పీకర్ పిలిస్తే కలవద్దని శాసించడం ఎంతవరకు సమంజసమని కొంతమంది ప్రశ్నిస్తున్నారట. ఒకవేళ స్పీకర్‌ను కలిస్తే సరెండర్ అయిపోతామని భయమా..? వైఎస్సార్ కోసం పదవులనే వదులుకున్న తమను అనుమానిస్తున్నారా..? వంటి ప్రశ్నలను లేవనెత్తుతున్నారట. అయితే ఈ ప్రశ్నల పరంపర అధిష్టానం దాకా వెళ్లడం లేదట. తమలో తామే గొణుక్కుంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారట. మొత్తమ్మీద జగన్ వర్గంగా ఉన్న ఆ 16 మంది ఎమ్మెల్యేల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా తయారైందనే వాదనలు వినబడుతున్నాయి.