2014 ఎన్నికల్లో జగన్ ఉప్పెన... అన్ని పార్టీలూ కొట్టుకుపోతాయ్
, శనివారం, 27 ఏప్రియల్ 2013 (14:53 IST)
అక్రమాస్తుల కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కారాగారం పాలయ్యారు. 2014 ఎన్నికలకు మరో ఏడాది ఉంది. ఈ ఎన్నికల నాటికి జగన్ మోహన్ రెడ్డి బయటకు వస్తారని జగన్ సోదరి షర్మిలతోపాటు రోజా లాంటి వారు కూడా జోస్యం చెపుతున్నారు. రోజా అయితే ఓ అడుగు ముందుకు వేసి 2014 ఎన్నికల తర్వాత రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం జగన్ పాల్పడిన ఆర్థిక నేరాలు చాలా తీవ్రమయినవనీ, జగన్ ఇప్పుడప్పుడే బయటకు వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు. మరోవైపు సీబీఐ జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి చార్జిషీట్లపై చార్జిషీట్లు వేసుకుంటూ వెళుతోంది. దీంతో జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ రావడం కష్టతరంగా మారింది. ఎన్ని చార్జిషీట్లు వేసినా 2014 ఎన్నికల నాటికి జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ లభించడం ఖాయమనీ, ఆయన ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు కనుక త్వరలోనే బయటకు వస్తారని వైకాపా నేతలు అంటున్నారు. 2014 ఎన్నికల్లో జగన్ సునామీ దెబ్బకు అన్ని పార్టీలు కొట్టుకుపోతాయనీ, భారీ మెజారిటీతో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం ఖాయమని అంటున్నారు.