జగన్ జనభేరి... నిన్న సీమాంధ్రలో సీఎం... ఇవాళ ఖమ్మంలో కేంద్రమంత్రి...
, బుధవారం, 5 మార్చి 2014 (21:51 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారంనాడు సీమాంధ్రలో సీఎంగా 4 ఫైళ్లపై సంతకాలు చేస్తానని చెప్పారు. బుధవారంనాడు ఖమ్మంలో జరిగిన జనభేరిలో మాట్లాడుతూ... తెలంగాణ ప్రాంతంలో తమ పార్టీ తరపున తొలి లోక్సభ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి పోటీ చేస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా ఇక్కడ నుంచి వైకాపా తరపున శ్రీనును గెలిపిస్తే కేంద్ర మంత్రిని కూడా చేస్తానని హామీ ఇచ్చారు.ఇంకా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర భూభాగాన్ని విడదీసినా ప్రజలను విడదీయలేరని అన్నారు. ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చేశారనీ, అవతల ప్రాంతానికి రాజధాని నిర్మాణానికి డబ్బులు గురించి కూడా ప్రస్తావించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐతే తెలుగు ప్రజలు ఏ ప్రాంతంలో కష్టమొచ్చినా నష్టమొచ్చినా మరో ప్రాంతంవారు ఆదుకునేందుకు సిద్ధంగా ఉంటారనీ, అలా చేసి నిరూపిద్దామని అన్నారు.తనకు ప్రాంతాలన్నీ సమానమేననీ, తెలంగాణ, సీమాంధ్ర అంతా ఒక్కటేనని అందువల్లనే సమైక్యం కావాలన్నానని చెప్పుకొచ్చారు. కానీ ఇవతల ఒక రకంగా అవతల ప్రాంతంలో ఇంకో రకంగా మాట్లాడి ప్రజల భావోద్వేగాలతో ఆటలాడుకోలేదన్నారు. రాజన్న రాజ్యం రెండు ప్రాంతాల్లోనూ తీసుకు వస్తానని జోస్యం చెప్పారు.