ఏసీ గదుల్లో పెరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ పేదరికం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని పీసీసి చీఫ్ బొత్స సత్యనారాయణ అన్నారు. పేదరికం గురించి మాట్లాడే జగన్ అంతటి విలాసవంతమైన భవనం ఎందుకు కట్టుకుంటారని ప్రశ్నించారు.
ఓదార్పు యాత్ర సాకుతో గొఱ్ఱెలు, బఱ్ఱెలతో ఫోటోలు దిగుతూ తాను పేదరికం చూశానంటూ ప్రజలను నమ్మించడానికి జగన్ తాపత్రయపడుతున్నారని అన్నారు. ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలంటూ ఆనాడు సంతకం పెట్టినందుకు బాధపడుతున్నానని చెప్పుకొచ్చారు.
ఇక డీఎస్‌కు ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించడం వెనుక ఎటువంటి రాజకీయ కోణాలు లేవనీ, తెలంగాణ సమస్యకు దీనికి ఎటువంటి లింకు లేదని చెప్పారు. ఈ ఎమ్మెల్సీ సీటు ఎంపిక నిర్ణయం ప్రాంతాలకు, మతాలకు, కులాలకు అతీతంగా జరిగిందన్నారు. డీఎస్‌కున్న అనుభవం దృష్ట్యా ఆయనను పదవి వరించిందన్నారు. ఎమ్మెల్సీ స్థానం దక్కలేదని చిరంజీవికి ఎటువంటి అసంతృప్తి లేదన్నారు. పరిస్థితులను ఆయనకు వివరించామన్నారు. కాంగ్రెస్ పార్టీలో విలీనమైన పీఆర్పీ శ్రేణులకు తగిన గుర్తింపు ఖచ్చితంగా ఉంటుందని హామీ ఇచ్చారు.