వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఆయనకు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా జారిపోతున్నారు. తాజాగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు తమ రాజీనామాలపై వెనక్కి తగ్గినట్టు సమాచారం.
తాము రాజీనామాలు చేయడం వల్ల రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే స్థితి లేదని, ఉప ఎన్నికలను ఎదుర్కోవాల్సి వస్తుందని, వాటిని తాము ఎదుర్కోవడానికి సిద్ధంగా లేమన్నది వారి వాదనగా ఉంది. అందుకే రాజీనామాలను వెనక్కి తీసుకునే అంశంపై పునరాలోచన చేస్తున్నట్టు చెప్పారు.
ప్రస్తుతం వీరి రాజీనామాలపై సభాపతి నాదెండ్ల మనోహర్ ఆమోదముద్ర వేస్తే ఈ ఉప ఎన్నికలతో పాటు 2014 సాధారణ ఎన్నికలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని వారు చెపుతున్నారు. అందుకే కడప, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామాలపై వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.
సీబీఐ తయారు చేసిన ఎఫ్ఐఆర్లో వైఎస్ఆర్ పేరును చేర్చినందుకు నిరసనగా 26 మంది శాసనసభ్యులు రాజీనామాలు చేసిన విషయం తెల్సిందే. కాలం గడిచే కొద్ది జగన్ వర్గ ఎమ్మెల్యేలలో విభేదాలు బయటపడుతున్నాయి.
తమ రాజీనామాల వల్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయే స్థితి లేకపోవడంతో కొంత మంది తీవ్ర అసంతృప్తికి గురై, రాజీనామాలను వెనక్కి తీసుకునేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.