ఎలక్ట్రానిక్ రంగంలో చైనా ఏది చేసినా విప్లవమే.. కొత్త కొత్త ఉత్పత్తులను ప్రవేశ పెట్టడంలో చైనాకు పెట్టింది పేరు. ఇటీవలే ఓ "సూపర్ కంప్యూటర్"ను తయారు చేసింది. ఇది నిజంగానే సూపర్ అండీ బాబు...!! ఇది ఒక సెకనుకు వెయ్యి ట్రిలియన్ పనులను చేసే సామర్ధ్యం కలిగి ఉంటుంది.
అంటే ఎంతో తెలుసా.. ఒక కొటి ముప్పై లక్షల మంది ప్రజలు 88 సంవత్సరాలు పాటు చేసే పనిని ఇది ఒక్క సెకనులో చేస్తుంది. అంతే కాదు... గ్రంధాలయాల్లో ఉండే రెండు కోట్ల డెబ్బై లక్షల పుస్తకాలలో ఉన్న సమాచారాన్ని నిక్షిప్తం చేసేంత సామర్ధ్యం కూడా కలిగి ఉండటం ఇందులో ప్రత్యేకత.
థియాన్హే-1 పేరుతో రూపొందించిన ఈ సూపర్ కంప్యూటర్ ఈ నెల నుంచి పనులు ప్రారంభించనున్నారు. థియాన్జిన్‌లో ఉన్న జాతీయ సూపర్‌కంప్యూటింగ్ కేంద్రం ఈ విషయాన్ని వెల్లడించింది. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ 2009లో ఈ సూపర్ కంప్యూటర్ పనులను ప్రారంభించింది.
థియాన్హే-1 సూపర్ కంప్యూటర్‌ను యానిమేషన్, బయోమెడికల్ రీసెర్చ్, ఏరోస్పేస్ ఎక్విప్‌మెంట్ డెవలప్‌మెంట్, రిసోర్స్ ఎక్స్‌ప్లోరేషన్, శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ డేటా, వాతావరణ సమాచారం వంటి వాటికి వినియోగించనున్నారు.
నవంబర్‌లో నిర్వహించిన టాప్-500 సూపర్ కంప్యూటర్‌లలో థియాన్హే-1 ఐదవ స్థానాన్ని ఆక్రమించింది. పీపుల్స్ డైలీ అనే పత్రిక గురువారం ఈ విషయాన్ని ప్రచురించింది. అమెరికా తర్వాత ఇటువంటి సూపర్ కంప్యూటర్ తయారు చేసిన దేశాలలో చైనా రెండవది కావడం విశేషం.