"ల్యాప్టాప్" చేతిలో ఉంటే ఓ చిన్నసైజు ప్రపంచం మన చేతుల్లో ఇమిడిపోతుంది. ఎన్ని గిగా బైట్ల పరిమాణం ఉన్న సమాచారాన్నైనా ల్యాప్‌టాప్ ద్వారా చాలా సులభంగా ఒకచోట నుంచి మరొక చోటుకు తరలించవచ్చు. డెస్క్‌టాప్ పీసీ తర్వాత వచ్చిన అప్‌గ్రేడెడ్ వెర్షనే ల్యాప్‌టాప్. ఈ ల్యాప్‌టాప్ వల్ల చాలా ఉపయోగాలే ఉన్నాయి. అలాగే దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి.
మీరు ఎక్కువగా ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని ఉపయోగిస్తున్నారా..? అయితే మీ అలవాటును మార్చుకోండి. లేకపోతే "నాకు గానీ వళ్లు మండింది అనుకో ఈ ల్యాప్‌టాప్‌ను బద్దలు చేసేస్తా" అనాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది నిజంగానే చర్మాన్ని మండిస్తుంది కాబట్టి. ల్యాప్‌టాప్‌లను ఇలా ఎక్కువసేపు తొడలపై ఉంచుకొని పనిచేయడం వల్ల ల్యాప్‌టాప్ ద్వారా వచ్చే వేడి సమస్యలను కలిగించే ఆస్కారం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ల్యాప్‌టాప్ ద్వారా జనించే వేడి 'టోస్టెడ్ స్కిన్ సిండ్రోమ్' అనే వ్యాధికి దారీతీయగలదని పరిశోధకులు చెబుతున్నారు. ఇలా ఉత్పత్తి అయిన వేడి వల్ల ల్యాప్‌టాప్ ఉంచిన ప్రాంతంలో శరీరం కాలిన గాయంలా నల్లగా మారటం, చర్మ సంబంధిత అలర్జీలు రావడం జరగవచ్చని వారు నిర్ధారించారు.
ప్రత్యేకించి చర్మం మరీ సున్నితంగా చిన్న పిల్లల్లో ఈ సమస్య మరింత అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఇది చర్మ క్యాన్సర్ (స్కిన్ క్యాన్సర్)కు దారీతీయవచ్చని పరిశోధకులు అంటున్నారు. అంతే కాకుండా.. మరో వైద్య నివేదిక ప్రకారం ల్యాప్‌టాప్‌ల వల్ల జనించే ఉష్ణం పురుషులలో వీర్య కణాల ఉత్పత్తిని తగ్గిస్తుందని వెల్లడించింది. కాబట్టి "డాడీ" కావాలనుకునే వాళ్లు ల్యాప్‌టాప్‌లను కొంచెం దూరంగా ఉంచి వాడుకుంటే మంచిది.
"పాతరోజుల్లో కొన్ని నడుం నొప్పి నివారణ కోసం హీటింగ్ ప్యాడ్స్ వాడేవారు. వాటి వల్ల చర్మం మీద పగుళ్లు (ర్యాషెస్) రావడం జరిగేవి. కానీ.. ఇప్పుడు ఈ అడ్వాన్సడ్ కంప్యూటర్లను తొడలపై ఎక్కువసేపు ఉంచుకొని పనిచేయడం వల్ల చర్మం దెబ్బతింటుంద"ని చర్మవైద్య నిపుణురాలు డాక్టర్ వైల్ రీసే తెలిపారు.
ల్యాప్‌టాప్ వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు:
వీలైనంత వరకూ ప్రయాణాలలో ల్యాప్‌టాప్‌ను ఉపయోగించకండి. అత్యవసర పరిస్థితిలో ఉపయోగించాల్సి వస్తే.. మందంగా ఓ టవల్‌ను తొడలపై ఉంచి ల్యాప్‌టాప్‌ను ఉపయోగించండి.
ఇళ్లల్లో ల్యాప్‌టాప్‌ను వాడాల్సి వస్తే.. వీలైనంత వరకూ కంప్యూటర్ టేబుల్‌ను ఉపయోగించండి. కాళ్లపై ఉంచుకొని వాడాలనుంటే మాత్రం తొడలపై తలగడను ఉంచి పని చేసుకోండి.
ల్యాప్‌టాప్‌పై ఉండే ఆప్టికల్ మౌస్ వాడకాన్ని వీలైనంత వరకూ తగ్గించండి. ఇలా తరచూ వాడటం వల్ల చేతి వేళ్లు అరిగిపోయి సున్నితంగా తయారయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి అదనపు మౌస్‌ను వాడండి.
ఇక.. చివరిగా మార్కెట్‌లో దొరికే ల్యాప్‌టాప్ కూలింగ్ ప్యాడ్స్‌ను వాడండి. కానీ వీటిని తొడలపై మాత్రం ఉంచుకోవద్దు. అలా చేస్తే విద్యుత్ షాక్‌కు గురయ్యే ఆస్కారం ఉంది.