మొబైల్ ఉంటే ప్రపంచం మీ చేతుల్లో ఉన్నట్లే!!
, బుధవారం, 26 మే 2010 (15:51 IST)
గతంలో "పుస్తకం హస్త భూషణం" అనేవారు పెద్దలు. అంటే పుస్తకం చేతిలోవుంటే ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని ఇనుమడింపజేస్తుంది. కాని ప్రస్తుత సమాజంలో మొబైల్ ఫోన్ లేని వ్యక్తులు చాలా అరుదుగా కనపడుతుంటారు. కాబట్టి "మొబైల్ హస్త భూషణం"లా అన్వయించుకోక తప్పదు మరి. ప్రస్తుతం మార్కెట్లో మొబైల్ ఫోన్లకున్న గిరాకీ అంతా ఇంతా కాదు. రోజుకొక మోడల్ మొబైల్ ఫోన్ మార్కెట్‌లోకి ప్రవేశిస్తోంది. మొబైల్ ఫోన్ చేతిలోవుంటే ప్రపంచం మీ చేతిలోవున్నట్లే. మొబైల్ ఫోన్‌ల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో మనిషి జీవనశైలిలోను మార్పులు వచ్చేశాయి. ప్రస్తుతం మొబైల్‌ఫోన్ మనిషి జీవితంలో ఓ భాగమైపోయింది. చేతిలో ఫోన్ లేకపోతే చాలామంది ఏదో పోగొట్టుకున్నట్లు ఉంటారు. నేటి సమాజంలో మొబైల్ ఫోన్ లేని జీవితాన్ని ఊహించుకోలేం. మొబైల్ ఫోన్ ద్వారా లాభాలతోపాటు నష్టాలూ ఉన్నాయి. బజార్, బస్టాండ్, రైల్వే స్టేషన్, ప్రముఖ కూడళ్ళు, వ్యాపారకేంద్రాలు, సినిమాహాళ్ళు తదితర ప్రాంతాల్లో నిరంతరం యువతతోపాటు పలువురు మొబైల్ ఫోన్ ద్వారా సంభాషించుకుంటు ఉండటం చూస్తుంటాం. ప్రస్తుతం భారతదేశ జనాభాలో దాదాపు నలభై శాతం ప్రజలు మొబైల్ ఫోన్ వాడుతున్నట్లు కేంద్ర టెలికాం శాఖ తెలిపింది. అంటే నలభై కోట్లమందికి పైగా ప్రజలు మొబైల్ వినియోగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇందులో 30శాతం ప్రజలు గ్రామీణప్రాంతాల్లోని వారంటే ఒకింత ఆశ్చర్యం కలగకమానదు. వచ్చే 2012 నాటికి దేశీయ మొబైల్ ఫోన్ వినియోగదారుల సంఖ్య రెండింతలు కానుందని విశ్లేషకుల అంచనా.
ప్రైవేట్ టెలికాం రంగంలో పెరుగుతున్న పోటీ, కొత్త, కొత్త మోడల్ మొబైల్ ఫోన్‌లు మార్కెట్‌లోకి ప్రవేశించడం, కేంద్ర ప్రభుత్వం మొబైల్ ఫోన్‌లలో సరికొత్త సేవలను అందించేందుకు ప్రణాళికలు రూపొందించుకోవడం తదితర కారణాలతో మొబైల్ ఫోన్ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. చైనా మొబైల్ ఫోన్‌లు దేశీయ మొబైల్ మార్కెట్‌లో విపరీతంగా దిగుమతి కావడంతో మొబైల్ ఫోన్‌ల ధరలు దిగివచ్చాయి. దీంతో సామాన్య ప్రజలకు మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. చైనా మొబైల్ ఫోన్‌ల ప్రవాహాన్ని తట్టుకుని నిలబడేందుకు దేశీయ మొబైల్ ఫోన్‌ల కంపెనీలు తమ ఫోన్ల ధరలను తగ్గించేశాయి.
లాభాలుః మొబైల్ ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువులతో నిరంతరం సంప్రదింపులు జరుపుకునే అవకాశం కలుగుతుంది. ఎప్పుడుపడితే అప్పుడు మనకు నచ్చిన వారితో సంభాషించేందుకు అవకాశం కలుగుతుంది. వీలైతే సంక్షిప్త సందేశాల(ఎస్ఎమ్ఎస్)ను పంపుకుంటుంటాం. ఆపద సమయంలో లక్షలాది మంది ప్రజలు మొబైల్ ఫోన్‌ల ద్వారా అత్యవసర చికిత్స కోసం ఆంబులెన్స్ వాహనాన్ని పిలిపించుకునేందుకు ఉపయోగపడుతోంది. అగ్నిమాపక శాఖను సంప్రదించేందుకు, పోలీసు శాఖకు సమాచారం అందించేందుకు మొబైల్ ఫోన్‌లు చాలా ఉపయోగపడుతున్నాయి. మొబైల్ ఫోన్‌లద్వారా జ్యోతిష్యం, వార్తలు, ఆటలు, షేర్ మార్కెట్ సమాచారం తదితరాలను తెలుసుకునే సౌకర్యం అందుబాటులోవుంది. మొబైల్ ఫోన్‌లో కెమెరావుంటే ఎప్పుడైనా, ఎక్కడైనా మనకు నచ్చిన చిత్రాలను తీసుకోవచ్చు. ఇప్పుడు వస్తున్న మొబైల్ ఫోన్‌లలో రికార్డింగ్ చేసుకునే సౌకర్యం ఉంది కాబట్టి మరింత ఉపయోగకరంగా ఉంటోంది. ఐ ఫోన్‌లో ఇంటర్నెట్ సౌకర్యంవుంది. గ్రామీణప్రాంతాల్లో సౌకర్యాలలేమి కొట్టుమిట్టాడుతున్నా మొబైల్ ఫోన్‌లు కొదవే లేదనడంలో సందేహం లేదు. రైతులు, వ్యాపారస్తులు, వాణిజ్య కేంద్రాల్లో పని చేసే సిబ్బందితో సంప్రదింపులు చేసేందుకు మొబైల్ ఫోన్‌లు చాలా ఉపయోగపడుతున్నాయి. వీటి సహాయంతో వ్యాపారం మరింత సరళతరమైందని వ్యాపార వర్గాలు చెపుతున్నాయి. రైతులవద్దనున్న సరుకులను తాము వెంటనే కొనుగోలు చేసేందుకు, వాటి ధరలను రైతులకు అందించేందుకు మొబైల్ ఎంతో సౌకర్యంగా ఉందంటున్నారు వ్యాపారస్తులు.
కొన్ని మొబైల్ ఫోన్‌లలో ఇంఫ్రారెట్ పోర్ట్ ఉంటే కొన్ని సాఫ్ట్‌వేర్‌ల సహాయంతో మీ మొబైల్ ఫోన్‌ను టీవీ రిమోట్‌లా ఉపయోగించుకోవచ్చు. దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లు మన దేశంలో చాలా ప్రాంతాల్లో దొరుకుతున్నాయి. మొబైల్ ఫోన్ ద్వారా మీరు కేవలం సమయం చూడటమే కాదు, మీరు అనుకున్న సమయానికి అలారం మోగేలా సెట్ చేసుకుంటే ఆ సమయానికి మీ మొబైల్ అలారం మోగుతుంది. దీంతో మీ పనులకు ఎలాంటి అంతరాయం కలగదు. మీ పనులను చక్కబెట్టుకునేందుకు లేదా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే దానిగురించి సంక్షిప్తంగా సమాచారాన్ని మీ మొబైల్ ఫోన్‌లో సేవ్ చేసుకుని అలారం సెట్ చేసుకునే సౌకర్యంవుంది. దీంతో మీరు అనుకున్న సమయానికి, అనుకున్న చోటుకి వెళ్ళేందుకు మొబైల్ ఎంతో సహకరిస్తుంది. మొబైల్ ఫోన్‌ను ఆటవస్తువుగా కూడా ఉపయోగించుకోవచ్చు. చిన్న పిల్లలే కాకుండా పెద్దలు కూడా మొబైల్ ఫోన్ ద్వారా ఆట(గేమ్)లు ఆడుకుంటుండటం మనం చూస్తూనే ఉంటాం. నష్టాలుః మొబైల్ ఫోన్ మనిషి జీవితంలో ఓ భాగమైపోయినా... చాలా సందర్భాల్లో అది ఇబ్బందులకు గురిచేస్తుంటుంది. ఉదాహరణకు మీరు మీ మీ కార్యాలయాల్లో వివిధ పనుల్లో, సమావేశాల్లో నిమగ్నమై ఉంటారు. అలాంటి సమయంలో ఫోన్ మ్రోగి మిమ్మల్ని డిస్ట్రబ్ చేస్తుంది. కాబట్టి మీరు మీ కార్యాలయంలోవున్నప్పుడు మీ ఫోన్‌ను శబ్దరహితంగా(సైలెంట్ మోడ్‌లో) ఉంచండి. దీంతో మీతోపాటు మీ తోటి ఉద్యోగులకు, ఇతరులు చేసే పనిలో అంతరాయం కలగదు.మీరు కార్యాలయంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసివుంచండి. మీకు ఎవరినుండి ఫోన్ వచ్చినా మీకు సేవలందించే టెలికాం సంస్థ ఆ ఫోన్ నెంబరును రిజస్టర్ చేసుకుని మీరు ఫోన్ ఆన్ చేసిన తర్వాత మిస్డ్ కాల్ మెసేజ్ పంపుతుంది. ఇలాంటి సేవలను కొన్ని టెలికాం కంపెనీలు అందజేస్తున్నాయి. మొబైల్ ఫోన్‌లు మార్కెట్‌లోకి ప్రవేశించిన తర్వాత చేతి గడియారాలు, అలారం టైం పీస్‌ల వ్యాపారంపై తీవ్రమైన ప్రభావం చూపించిందనడంలో సందేహం లేదు. వీటితోపాటు టార్చ్ లైట్‌ల వ్యాపారం కూడా మందగించింది. కాగా ఐఫోన్ మార్కెట్‌లోకి ప్రవేశించిన తర్వాత మీడియా, వెబ్‌సైట్, బ్లాగుల్లో దీనిపై చర్చలు కొనసాగాయి. ఐఫోన్ ధర కాస్త ఎక్కువే. కాబట్టి దేశంలో ఐఫోన్ వినియోగదారులు చాలా తక్కువనే చెప్పాలి.