మీ మొబైల్ ఫోన్ వైరు లేకుండా ఛార్జింగ్ అవుతుందా..!?
మీ మొబైల్ ఫోన్, డిజిటల్ కెమెరా, ల్యాప్‌టాప్, ఐపాడ్... వంటివి వైర్లు లేకుండా ఛార్జింగ్ అవుతాయా..? "ఇంపాజిబుల్".. అంటారా..! కానీ అక్కడ మాత్రం ఇది పాజిబుల్. అవును..! వైర్లతో పని లేకుండా వివిధ రకాల పోర్టబుల్ ఎలక్ట్రానిక్ పరికారాలను ఛార్జింగ్ చేసే వ్యవస్థను జపాన్ శాస్త్రవేత్తలు రూపొందించారు. జపాన్‌కు చెందిన్ ఎలక్ట్రానిక్ ఉపకరణాల సంస్థ "ఫుజిట్సు" ఈ పరికరాన్ని తయారు చేసింది.ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మొదటిసారి ఈ పరికరాన్ని తాము రూపొందించినట్లు ఫుజిట్సు తెలిపింది. ఇది ఛార్జర్‌కు ఎలక్ట్రానిక్ పరికరాలకు మధ్య ఏర్పడే అయస్కాంత క్షేత్రాల ద్వారా పని చేస్తుంది. ఈ కేబుల్ రహిత ఛార్జింగ్ పరికరాన్ని విద్యుత్ సరఫరా అయ్యే ప్లగ్‌లో ఉంచితే చాలు కొన్ని మీటర్ల వరకూ ఉన్న మొబైల్ ఫోన్లు, ఐపాడ్‌లు, ల్యాప్‌టాప్‌లు ఆటోమేటిక్‌గా ఛార్జింగ్ అయిపోతాయి. ఇలా.. ఒకే పరికరంతో ఎన్ని వస్తువులనైనా ఛార్జింగ్ చేసుకోవచ్చు.ఈ పరికరాన్ని రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు వంటి పబ్లిక్ ప్రదేశాలలో అమర్చుకుంటే అక్కడ నిల్చునే మన ఫోన్‌ను ఎంచక్కా ఛార్జింగ్ చేసుకోవచ్చు. అంతే కాకుండా.. ఎలక్ట్రిక్ కార్లలో కూడా ఇదే టెక్నాలజీను తీసుకురావడానికి సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఒకాసా ప్రిఫెక్సర్ యూనివర్సిటీలో నిర్వహించిన "ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్స్" సదస్సులో ఫుజిట్సు ఈ పరకరాన్ని ప్రదర్శించింది.ఆశ్చర్యంగా ఉంది కదూ..! ఈ టెక్నాలజీ మన దేశంలోకి వస్తే బావుటుంది కదా..! బావుటుంది అనుకోండి కాకపోతే.. ఇందుకోసం మనం 2012 వరకూ ఆగాల్సిందే. అప్పుడయితే వీటిని ఈ సంస్థ వాణిజ్యపరంగా విక్రయిస్తుందట.