ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్:
ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించాలన్న ప్రభుత్వం కల కార్యరూపం దాల్చనుంది. ఈ అంశంపై అక్టోబర్‌లో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని టెలికాం నియంత్రణ ప్రాధికారిక సంస్థ (ట్రాయ్) ఛైర్మన్ డాక్టర్ జె.ఎస్. శర్మ తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో దేశవ్యాప్తంగా న్యూ ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాల నుంచి మొత్తం 115 మంది కేబుల్ నిర్వాహకులు, టెలికాం ఆపరేటర్లు పులువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఇందులో భాగంగా 2014 నాటికి పది కోట్ల నివాసాలకు, అలాగే 2020 నాటికి దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి బ్రాడ్‌బ్యాండ్ సదుపాయాన్ని కల్పించాలనేది ట్రాయ్ లక్ష్యమని శర్మ అన్నారు. ఇప్పటి వరకూ 85శాతం వైర్ లైన్ ద్వారా బ్రాడ్ బ్యాండ్ సదుపాయాన్నికల్పించామని ఆయన తెలిపారు. 3జీ సేవలు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో బ్రాడ్‌బ్యాండ్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
నవంబర్ ఒకటి నుంచి నంబర్ పోర్టబిలిటీ అమలు:
ఇదిలా ఉంటే ఎప్పటి నుంచే వినియోగదారులను ఇదిగో అదిగో అంటూ.. ఊరిస్తున్న నంబర్ పోర్టబిలిటీకు తెరపడింది. ఎట్టి పరిస్థితుల్లో నవంబర్ ఒకటి నుంచి నంబర్ పోర్టబిలిటీను అమలు చేయాలని ట్రాయ్ నిర్ణయించింది. ఈ తేదీలో ఎటువంటి మార్పు ఉండబోదని ఖచ్చితంగా ఈ తేదీ నుంచి ఈ సేవలను అమలు చేస్తామని శర్మ తెలిపారు. ఈ సదుపాయం అమలులోకి వస్తే వినియోగదారుడు ఏ కంపెనీ నెట్‌వర్క్‌కు మారినా కూడా పాత నెంబర్ అలానే ఉంటుంది. కేవలం ఆపరేటర్ మాత్రమే మారుతుంది.
అవాంచిత కాల్స్, ఎస్ఎమ్ఎస్‌లపై నిషేధం:
వినియోగదారుడు కోరుకోపోయిన పలు మార్కెటింగ్ సంస్థల నుంచి వచ్చే మార్కెటంగ్ కాల్స్, ఎస్ఎమ్ఎస్‌లకు ఇకపై తెర పడనుంది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందిస్తున్నామని శర్మ అన్నారు. ఈ నెలాఖరులోగా ఈ అంశంపై స్పష్టమైన ప్రణాళికను అందజేస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉన్న "డు నాట్ కాల్" (డీఎన్‌సీ) సేవలను మరింత పటిష్టం చేస్తే ఇటువంటి కాల్స్‌ను నిరోధించవచ్చని ట్రాయ్ తెలిపింది.