సమాచారాన్ని ప్రజలకు అందించడంలో మీడియా శక్తివంతంగా ఉన్నప్పటికీ సామాజిక వెబ్‌సైట్లు శక్తివంతమైన నూతన పరికరాలుగా ఆవిర్భవించాయి. సామాజిక వెబ్‌సైట్ల వల్ల లాభనష్టాలు ఉన్నప్పటికీ ప్రజలను చైతన్యం చేయడంలో మాత్రం ముందున్నాయి.
స్వేచ్ఛ లేదా అణచివేత సందేశాలను పంపుకోవడానికి ప్రజలు ట్విట్టర్, ఫేస్‌బుక్‌లను ఆయుధాలుగా ఉపయోగించుకుంటున్నారని ఇటీవల ఈజిప్ట్, కెన్యాల్లో చోటుచేసుకొన్న ప్రజా పోరాటం, హింసలపై అధ్యయనం చేస్తున్న బృందానికి నేతృత్వం వహిస్తున్న మాస్ కమ్యూనికేషన్స్ గ్రాడ్యుయేట్ విద్యార్ధి బ్రాండీ మార్టిన్ పేర్కొన్నారు. ఈ రెండు ప్రజా సంఘటనలు సాంకేతిక కారణంగానే ఎగసిపడ్డాయని మార్టిన్ విశ్లేషించారు.
జనవరి 25న ఈజిప్ట్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు ఏర్పడగానే పౌరులు బ్లాగ్‌లను వాడటం ప్రారంభించారు. ప్రస్తుత ప్రభుత్వం వల్ల కలుగుతున్న ఇబ్బందులను వివరిస్తూ పౌరులు సామాజిక వెబ్‌సైట్లు, బ్లాగ్‌ల ద్వారా సందేశాలను పంపుకున్నారు. ఆ ఉద్యమానికి సంబంధించి సుమారు 56 వేల మంది ఈజిప్ట్ పౌరులు ఫేస్‌బుక్ వినియోగించుకోగా దాదాపు 15,000 మంది పౌరులు ట్విట్టర్ ద్వారా ఆందోళనల సమాచారాన్ని వ్యాప్తి చేశారు.
అప్పటి అధ్యక్షుడు హోస్నీ ముబారక్ నేతృత్వంలోని ప్రభుత్వం వెనువెంటనే బ్లాగర్లను అదుపులోకి తీసుకొని, ఇంటర్నెట్‌ని తన చేతుల్లోకి తెచ్చుకొన్నప్పటికీ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. వోడాఫోన్, మొబినిల్, ఎటిసలాత్ వంటి ప్రధాన మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్లు ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సర్వీసులను నిలిపేశాయి. కాగా ప్రభుత్వ అనుకూల బలగాలు మాత్రం తమ అవసరాల కోసం ఇంటర్నెట్ సందేశాలను పంపడాన్ని మాత్రం కొనసాగించాయి.
2008లో కెన్యాలో చోటుచేసుకొన్న హింస కూడా సామాజిక వెబ్‌సైట్ల ద్వారానే వ్యాప్తి చెందింది. హింసలో దాదాపు 1,500 మంది కెన్యా పౌరులు చనిపోయారు. ఈ విధంగా సామాజిక వెబ్‌సైట్లు మంచి, చెడులను త్వరగా వ్యాప్తి చేయడంలో ముందున్నాయి.